మామూలుగానే ఏ మూల డ్రగ్స్ పట్టుబడ్డా టాలీవుడ్ కు లింకులు వేస్తుంటారు చాలామంది. ఈ విషయంలో ఇంకా జాగ్రత్తగా ఉండాల్సింది పోయి.. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో ఎదగాలనుకుంటున్న వాళ్లు కూడా డ్రగ్స్ బారిన పడటం.. యదేచ్చగా వాటిని వాడటం వంటివి చూస్తుంటే.. వీరికి చట్టాల పట్ల అవగాహన శిక్షల పట్ల భయమూ లేదు అనే అనుకోవాలి. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతోంది. దీనికోసం పోలీస్ లు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.
తాజాగా హైదరాబాద్ మాదాపూర్ లోని ఓ ఓయో రూమ్ లో డ్రగ్స్ పార్టీ నిర్వహించడం కలకలం రేపుతోంది. ఈ పార్టీలో కొరియోగ్రాఫర్ కన్హ మహంతి పాల్గొన్నాడని పోలీస్ లు నిర్ధారించారు. కన్హ మహంతితో పాటు పట్టుపడ్డ ప్రముఖ ఆర్కిటెక్చర్ ప్రియాంక రెడ్డిని కూడా పోలీస్ లు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ప్రియాంక రెడ్డినే ఈ డ్రగ్స్ పార్టీ ఇచ్చిందని తేలింది. ఈ ఇద్దరితో పాటు మరో నలుగురిని పోలీస్ లు అదుపులోకి తీసుకున్నారు. ఈ పార్టీలో ఎండీఎంఏ డ్రగ్స్‌తో పాటు మరో రెండు రకాల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు పోలీస్ లు.
కన్హ మహంతి ఢీ షోలో చాలాకాలంగా పనిచేశాడు. అక్కడి నుంచి టాలీవుడ్ వరకూ రావాల్సిన వాడు కాస్తా డ్రగ్స్ తీసుకుంటూ పట్టబడి కటకటాల పాలు కాబోతున్నాడు.