సూపర్ స్టార్.. ఈ ట్యాగ్ ను వెనక ఉంచుకుని ముందుకు దూకాడు మహేష్ బాబు. కానీ ఆ స్టార్డమ్ రావడానికి మాత్రం చాలాకాలం పట్టింది.తండ్రి సంపాదించిన పేరు ఎవరికైనా ఈజీగానే వస్తుంది. కానీ ఆ ఇమేజూ రావాలంటేనే కష్టం. ఆ కష్టం అనుభవించాడు కాబట్టే.. మహేష్ బాబు ముందు సూపర్ స్టార్ చేరినప్పుడు ఎవరూ పెద్దగా విమర్శించలేదు. ఇంకా చెప్పాలంటే కృష్ణగారి తర్వాత ఆ టైటిల్ అతనికే యాప్ట్ అనేశారు కూడా. అది నిజమే అని ప్రతి సినమాతో ప్రూవ్ చేసుకుంటూ దూసుకుపోతోన్న ఈ రాజకుమారుడి పుట్టిన రోజు ఇవాళ.
మహేష్ బాబు.. బార్న్ విత్ సిల్వర్ స్పూన్. అందుకే ఏమంత కష్టపడకుండానే సినిమాల్లోకి వచ్చాడు. కానీ స్టార్డమ్ మాత్రం అంత ఈజీగా రాలేదు. స్టార్ వార్ లో ఎన్నో హర్డిల్స్ ని దాటుకుని సూపర్ స్టార్ అయ్యాడు. సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా.. అన్నయ్య రమేష్ బాబు నీడ సినిమాలో ఛైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాల్లోకి వచ్చాడు. ఆ తర్వాత పోరాటం,బజారురౌడీ, ముగ్గురుకొడుకులు, గూఢఛారి117, కొడుకుదిద్దిన కాపురం, బాలచంద్రుడు లాంటి సినిమాలు చేశాడు మహేష్. అన్ని సినిమాల్లోనూ చాక్లెట్ బాయ్ లుక్స్ తో తండ్రికి తనయుడుగా చిచ్చరపిడుగు అనిపించుకున్నాడు. అయితే సినిమాల వల్ల మహేష్ చదువు పాడవుతుందని, చదువు పూర్తయ్యాక మళ్లీ సినిమాల్లోకి వద్దువు అంటూ మహేష్ ని కొన్నాళ్లపాటు సినిమాలకు దూరంగా ఉంచారు కృష్ణ
ఛైల్డ్ ఆర్టిస్ట్ గానే అదరగొట్టిన మహేష్ బాబు, రాఘవేంద్రరావు డైరెక్షన్లో వచ్చిన రాజకుమారుడు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ప్రీతిజింటా హీరోయిన్ గా చేసిన ఈ సినిమా సూపర్ సక్సెస్ అయ్యింది. మహేష్ కు నంది అవార్డు తెచ్చిపెట్టిన ఈ సినిమాతో కృష్ణ కొడుకు అదరగొట్టేశాడనే పేరొచ్చింది. అదే టైంలో రమేష్ బాబు స్లో అవ్వడంతో, కృష్ణ ప్లేస్ ని రీప్లేస్ చేసే బాధ్యతని మహేష్ కు అప్పగించారు సూపర్ స్టార్ ఫ్యాన్స్.
ఫస్ట్ హిట్ లో బోల్డంత కిక్ ఉంటుంది. రాజకుమారుడు మహేష్ బాబుకు ఈ కిక్కే ఇచ్చింది. ఈ జోష్ లో వెరీ నెక్ట్స్ ఇయర్ యువరాజు, వంశీ సినిమాలు రిలీజ్ చేశాడు మహేష్. కానీ ఈ రెండు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. దీంతో సూపర్ స్టార్ అభిమానుల్లో ఆందోళన. అరె రమేష్ బాబు ఫెయిల్ అయినా, మహేష్ మా ఆశలు మోస్తాడు అనుకుంటే ఈ ఫెయిల్యూర్స్ ఏంటని కంగారు పడ్డారు. కానీ ఆ టెన్షన్ కొంతకాలమే. ఎందుకంటే ఆ వెంటనే కృష్ణ వంశీ డైరెక్షన్లో వచ్చిన మురారి సినిమా సూపర్ హిట్ అయ్యింది. కృష్ణ అభిమానులకు పండగ తీసుకొచ్చింది.
కృష్ణ అంటే ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్. సరికొత్త టెక్నాలజీని పరిచయం చెయ్యడంలో మాస్టర్. మరి మహేష్ బాబు ఇలాంటి రొటీన్ సినిమాలకే పరిమితం అయిపోతాడా? అనుకుంటోన్న టైంలో కృష్ణమార్క్ కౌ బాయ్ సినిమా టక్కరి దొంగ చేశాడు. జయంత్ సి ఫరాన్జీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో మహేష్ బాబు రియల్ స్టంట్స్ తో ఆశ్చర్యపరిచాడు గానీ, సినిమా ఫెయిల్ అయ్యింది. కథ కనెక్ట్ కాలేదు. కథనం మరీ నేలవిడిచి సాముగా మారింది.
మహేష్ బాబు హిట్టు ఫ్లాపులతో సంబందం లేకుండా సినిమాలు చేస్తున్నాడు. కానీ, చాక్లెట్ బాయ్ క్యారెక్టర్స్ తో మాస్ కి ఎక్కడం కష్టం... మాస్ ఆడియన్స్ లో ఫాలోయింగ్ లేకపోతే కృష్ణ వదిలిపెట్టిన ప్లేస్ ని రీప్లేస్ చెయ్యడం కష్టం అని సినీపెద్దలంతా మాట్లాడడం స్టార్ట్ అయ్యింది. మరి మాస్ అంటే ఏంటి? అందరినీ మెప్పించడమే కదా. అప్పటికే ఇండస్ట్రీలో ఇతర వారసులు వచ్చి సరికొత్త పోటీగా మారారు. ఈ పోటీని తట్టుకోవడమే కాదు తనూ పోటీగా మారడం ఒక్కడుతో స్టార్ట్ అయింది. తర్వాత అతనికి పోటీ అనుకున్న చాలామంది అతని తర్వాత రేస్ లో ఉండిపోయారు.
మహేష్ బాబు కెరీర్ ని మలుపుతిప్పిన సినిమా ఒక్కడు. గుణశేఖర్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాలో ఛార్మినార్ సెట్టింగ్ ఓ హైలెట్ అయితే, మహేష్ బాబు పెర్ఫామెన్స్ మరో హైలెట్. కబడ్డి ప్లేయర్ లా యూత్ రిప్రజెంటేటివ్ గా కనిపించిన మహేష్ బాబు యాక్టింగ్ కు ఫుల్ మార్కులు పడ్డాయి. ఫిల్మ్ ఫేర్ అవార్డూ వచ్చింది. ఇక అప్పటి వరకు కృష్ణ అభిమానులే ప్రిన్స్ ఫ్యాన్స్ అన్న లైన్ పోయి, తనకంటూ సొంత ఫాలోయింగ్ ఏర్పడిందీ ఒక్కడు సినిమాతోనే.
మహేష్ బాబు ఎప్పుడూ ఛాలెంజెస్ ని ఫేస్ చెయ్యడానికే ఇష్టపడతాడు. ఒక్కడు తర్వాత వరుసగా మాస్ సినిమాలు చేసుంటే మహేష్ చాలా త్వరగా సూపర్ స్టార్ అయ్యేవాడు. కానీ రొటీన్ ఫార్ములాలో వెళ్లకుండా నిజం, నాని లాంటి సినిమాలతో ప్రయోగాలు చేశాడు. సైన్సు బేస్డు స్టోరీతో నాని, అన్యాయాన్ని ఎదురించే పిరికివాడిగా నిజం సినిమాలు చేశాడు మహేష్ బాబు. ఈ సినిమాలు మహేష్ కు కొత్త ఇమేజ్ తీసుకొచ్చినా, అభిమానులకు ఆకట్టుకోవడంలో విఫలం అయ్యాయి.
మళ్లీ ఫెయిల్యూర్స్ తో వెనుకబడ్డాడు మహేష్ బాబు. దీంతో ఓ హిట్ కొట్టాలని ఒక్కడుతో తన ఇమేజ్ మార్చేసిన గుణశేఖర్ తో అర్జున్ సినిమా చేశాడు. కానీ ఈ సినిమా కూడా మహేష్ ఫ్యాన్స్ ని సాటిస్ ఫై చెయ్యలేదు. దీంతో నువ్వే నువ్వేతో సూపర్ హిట్ కొట్టి, ద్వితీయవిఘ్నాన్ని దాటడానికి టైం తీసుకుంటోన్న త్రివిక్రమ్ డైరెక్షన్లో అతడు చేశాడు మహేష్. టాలీవుడ్ లో ట్రెండ్ సెట్టర్ లా నిలిచి మహేష్ ఇమేజ్ ని అమాంతం పెంచేసింది అతడు. రిలీజ్ టైమ్ లో కమర్షియల్ గాబ్లాక్ బస్టర్ కాకపోయినా ఇప్పుడది లైబ్రరీ మూవీగా మారింది.
హిట్స్ ఉన్నాయి. ఫ్లాప్స్ వచ్చినా అధైర్యపడకుండా దూసుకెళ్తున్నాడు. కానీ మహేష్ బాబు ఇంకేదో సాధించాలి. అభిమానులంతా గర్వపడేలా, స్టార్ వార్ లో దుమ్ముదులిపేలా ఓ హిట్ కావాలి. అది ఫలానా హీరోకి ఫలానా సినిమాఉందే.. అలా అని అంతాఅనుకునేలా ఉండాలి.. అనుకుంటోన్న టైమ్ లో పూరీ జగన్నాథ్ డైరెక్షన్లో వచ్చిన పోకిరి అభిమానుల ఆకలిని తీర్చింది. ఆ టైమ్ కు ఉన్న అన్ని రికార్డులను తిరగరాస్తూ మహేష్ ని టాప్ రేసులో నిలిపింది పోకిరి..పోకిరి దెబ్బకు రికార్డుల దిమ్మతిరిగి టాప్ రేస్ మైండ్ బ్లాంక్ అయింది.
పోకిరి టాలీవుడ్ లో ఖాకీ కథలకు కొత్త స్టైల్ ని తీసుకొచ్చిన ట్రెండ్ సెట్టింగ్ మూవీ. ఎవడు కొడితే దిమ్మతిరిగిమైండ్ బ్లాంక్ అయిపోద్దో వాడే పండుగాడు అంటూ మహేష్ చేసిన రచ్చకు బాక్సాఫీస్ మొత్తం ఊగిపోయింది. కలెక్షన్ల రికార్డులు సృష్టించిందీ పోకిరి. ఈ హిట్ తో మహేష్ రేంజ్ పెరిగిపోయింది. మాస్ లో స్ట్రాంగ్ బేస్ క్రియేట్ అయ్యింది.
పోకిరి తర్వాత సైనికుడు, అతిధి, ఖలేజా లాంటి సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అయితే ఖలేజా సినిమా ఫ్లాప్ అయినా మహేష్ బాబుకు మాత్రం సరికొత్త ఇమేజ్ తీసుకొచ్చింది. అప్పటివరకు లవర్ బాయ్, యాక్షన్ హీరోగానే కనిపించిన మహేష్ ఫస్ట్ టైం కామెడీ చేశాడు. పంచ్ లతో అదరగొట్టాడు. ఎలాంటి జానర్ సినిమా అయినా చెయ్యగల ఖలేజా ఉందని ఈ సినిమాతో నిరూపించాడు మహేష్.
ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఖలేజా ఫ్లాప్ అయితే, ఈసారి మాస్ ఎంటర్టైనర్ తో దూకుడు చూపించాడు. శ్రీనువైట్ల డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. దూకుడులో పోలీస్ గా ఎమ్మెల్యేగా సరికొత్త లుక్స్ తోనే కాదు సరికొత్త కథనంతోనూ కట్టిపడేశాడు. దూకుడుతో చాలా వరకూ తన రికార్డులు తనే బద్ధలు కొట్టాడు.
ఎప్పుడూ ఒకే ఫార్మాట్లో వెళ్లడానికి ఇష్టపడని మహేష్ వెంటనే యాక్షన్ హీరోగా పూరీజగన్నాథ్ డైరెక్సన్లో బిజినెస్ మేన్ చేశాడు. మహేష్ బాబు అంతా తానై నడిపించిన ఈ సినిమా అభిమానులకు ఫుల్ కిక్ ఇచ్చి, కలెక్షన్లు కురిపించింది. ఈ సక్సెస్ తో మహేష్ బాక్సాఫీప్ బిజినెస్ మేన్ లా మారిపోయాడు.
మహేష్ బాబు హీరోయిజాన్ని నమ్ముకుంది తక్కువ. స్టోరీనే నమ్మాడు. తన చుట్టే సినిమా అంతా తిరగాలని అనుకోలేదు. తొలినాళ్లలో అలా చేసినా.. తర్వాత ప్రతి విజయంతోనూ కథకే ఇంపార్టెన్స్ ఇవ్వడం పెంచాడు. అందుకే వెంకటేష్ తో కలిసి మల్టీస్టారర్ మూవీ సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు చేశాడు. టాలీవుడ్ లో 20ఏళ్ల తర్వాత వచ్చిన బిగ్గెస్ట్ మల్టీస్టారర్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. ఇలాంటి ట్రెండ్ సెట్టింగ్ మల్టీస్టారర్ తో ఆ రోజుల్లో కృష్ణగారు చేసిన మల్టీస్టారర్స్ ను నాటి తరం ప్రేక్షకులకు మరోసారి గుర్తొచ్చేలా చేశాడు.
హ్యాట్రిక్ హిట్స్ తో జోష్ లో ఉన్న మహేష్ బాబు, రెగ్యులర్ మాస్ మసాలా సినిమా చేసుంటే టాప్ ఛైర్ దక్కించుకునేవాడే. కానీ నెంబర్ గేమ్ పై నమ్మకం లేని మహేష్ సుకుమార్ డైరెక్షన్లో సైకలాజికల్ థ్రిల్లర్ వన్ నేనొక్కడినే చేశాడు. ఈ సినిమా మహేష్ లోని అత్యుత్తమ నటుడిని బయటకు తీసుకొచ్చి, విమర్శకులను మెప్పించింది కానీ కమర్షియల్ గా హిట్ అవ్వలేదు.
వన్ తర్వాత వచ్చిన ఆగడు పెద్ద డిజాస్టర్ అయ్యింది. ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేసింది. దీంతో నెక్ట్స్ ప్రాజెక్ట్సు పై ప్రత్యేక శ్రధ్ద తీసుకున్నాడు మహేష్ బాబు. ఇలా ఒకటికి రెండుసార్లు ఆలోచించి షూటింగ్స్ ని పోస్ట్ పోన్ చెయ్యడంతో మహేష్ భయపడుతున్నాడనే టాక్ వచ్చింది. కానీ ఎవరేమన్నా పట్టించుకోలేదు. ఖచ్చితంగా హిట్ కొట్టి తీరాలనే డిసైడ్ అయ్యాడు. కొరటాల శివ డైరెక్షన్లో శ్రీమంతుడులా వచ్చి సూపర్ హిట్ కొట్టాడు. 150కోట్లకు పైగా కలెక్షన్లతో టాలీవుడ్ లో వందకోట్ల క్లబ్ లో చేరిన రెండో హీరోగా రికార్డ్ క్రియేట్ చేశాడు మహేశ్.
శ్రీమంతుడు తర్వాత భారీ హైప్స్ మధ్య వచ్చిన బ్రహ్మోత్సవం ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. తర్వాత స్పైడర్ కూడా పోయింది. అప్పుడే కొత్తగా ఆలోచించాడు మహేష్. 2018 నుంచి గేర్ మార్చాడు. ఆ యేడాది వచ్చిన భరత్ అనే నేను నుంచి ఇప్పటి వరకూ ఫ్లాప్ లేదు. మహర్షి, సరిలేరు నీకెవ్వరు, సర్కారువారి పాట, గుంటూరు కారం.. ఇలా విజయాలకు హద్దే లేదు అన్నట్టుగా దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం రాజమౌళితో చేస్తోన్న మూవీతో తన ఛరిష్మాను ప్రపంచానికి చూపించబోతున్నాడు. ఇండియా నుంచి కరెక్ట్ గా హాలీవుడ్ కటౌట్ లా కనిపించే ఏకైక హీరో మహేష్. అలాంటి తను త్వరలోనే వాల్డ్ ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. ఈ ఎంట్రీతో ఇండియాలో అనేక రికార్డులు కనుమరుగవడం ఖాయం.
మహేష్ బాబు సినిమాలో మాత్రమే కాదు, రియల్ లైఫ్ లోనూ శ్రీమంతుడే. తన సొంత ఊరు బుర్రిపాలెం, మహబూబ్ నగర్ జిల్లాలోని సిద్దాపురం గ్రామాన్ని దత్తత తీసుకున్నాడు. బ్రాండ్ అంబాసిడరింగ్ ద్వారా వస్తోన్న మొత్తంలో 50శాతం వరకు సేవాకార్యాక్రమాలకు వినియోగిస్తున్నాడు. వందలమంది చిన్న పిల్లలకు హార్డ్ సర్జరీలు ఉచితంగా చేయిస్తూ ప్రాణదాతలా మారాడు. రీల్ లైఫ్ తో పాటు రియల్ లైఫ్ లోనూ హీరో అనిపించుకుంటోన్న మహేష్ బాబు సూపర్ హిట్స్ తో సక్సెస్ ఫుల్ గా కెరీర్ ని రన్ చెయ్యాలని కోరుకుంటూ టివి5 ఎంటర్టైన్మెంట్ టీమ్ తరఫున బర్త్ డే విషెష్ చెబుదాం.
- బాబురావు. కామళ్ల