Rocking Rakesh : కేసీఆర్ ట్రైలర్.. దొంగకోడి రుచే వేరు

Update: 2024-10-19 12:16 GMT

జబర్దస్త్ షోతో వచ్చిన పాపులారిటీతో సినిమాల్లో నటించిన వాళ్లు చాలామందే ఉన్నారు. సుధీర్, ధన్ రాజ్ వంటి వాళ్లు హీరోలుగా కూడా చేస్తున్నారు. మిగతా వాళ్లు కమెడియన్స్ గా తమకంటూ గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇప్పటి వరకూ చిన్న పాత్రలతో మెప్పించిన రాకింగ్ రాకేష్ కూడా హీరోగా మారాడు. విశేషం ఏంటంటే ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే తో పాటు నిర్మాత కూడా తనే. ఫస్ట్ మూవీకి ‘కేసీఆర్’అని మంచి క్యాచీ టైటిల్ పెట్టాడు. అంటే కేశవ చంద్ర రమావత్ అని అర్థం అని విపులీకరించాడు. గరుడ వేగ అంజి దర్శకుడు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ విడుదల చేశారు.

కేసీఆర్ అనే మూవీ ఓ గిరిజన గ్రామానికి చెందిన కథ. పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో కనిపిస్తోంది. ఆ తండాలో చిన్నప్పటి నుంచీ బావే తన భర్త అని నమ్ముకున్న అమ్మాయి.. అతని కోసమే బ్రతుకుతున్నట్టుగా ఆరాధిస్తూ ఉంటుంది. తన ఇంట్లో ఏం వండినా అంతా తెచ్చి బావకే పెడుతుంది. అతని కోసం కోళ్లను కూడా దొంగతనం చేస్తుంది. మరదలు తెచ్చిన దొంగకోడి మాంసం రుచి సొంత కోళ్లకు ఉండవు అని సపోర్ట్ కూడా చేస్తాడు బావ. ఇదంతా చూసి ఊరి జనం అంతా మంచి జంట అనుకుంటారు. కట్ చేస్తే అసలు ఆ అమ్మాయిని తను భార్యగా ఎప్పుడూ చూడలేదు అని చెబుతాడీ కుర్రాడు. పైగా మరో పెళ్లికి సిద్ధం అవుతాడు కూడా. అటు బావ వదిలేశాడని.. ఆ అమ్మాయి కూడా మరో పెళ్లికి సిద్ధం అవుతుంది. ఇదే టైమ్ లో కేశవ చంద్ర హైదరాబాద్ రావాల్సి వస్తుంది. అక్కడ ఎవరెవరినో కలిసే ప్రయత్నాల్లో మోసపోతూ ఉంటాడు. చివరికి మరదలి కోసం ఆక్రోశ పడతాడు. మరి అతను హైదరాబాద్ ఎందుకు వచ్చాడు.. మరదలిని ఎందుకు వద్దనుకున్నాడు అనేది సినిమాలో చూడాలి.

సింపుల్ స్టోరీతో మంచి ఎమోషన్స్ తో పాటు ఓ సందేశం కూడా మిక్స్ అయిన కథలా ఉంది. రాకేష్ కు జోడీగా నటించిన అనన్య క్రిష్ణ అనే అమ్మాయి బావుంది. చరణ్ అర్జున్ సంగీతం అందించాడు. ట్రైలర్ తో రిలీజ్ డేట్ చెప్పలేదు కానీ.. త్వరలోనే విడుదల చేయబోతున్నారీ చిత్రాన్ని.

Full View

Tags:    

Similar News