Prakash Raj: కేటీఆర్‌తో ఏకీభవించిన ప్రకాశ్ రాజ్.. సారీ సరిపోదంటూ..
Prakash Raj: సాగు చట్టాల రద్దు దేశవ్యాప్తంగా రైతుల జీవితాల్లో సంతోషాన్ని నింపింది.;
Prakash Raj, KTR (tv5news.in)
Prakash Raj: సాగు చట్టాల రద్దు దేశవ్యాప్తంగా రైతుల జీవితాల్లో సంతోషాన్ని నింపింది. దాదాపు సంవత్సరం పైగా పోరాడుతున్న రైతుల ఈ నిర్ణయంతో కాస్త కుదుటపడ్డారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయానికి రైతులు మాత్రమే కాదు.. దేశవ్యాప్తంగా ప్రజలు కూడా సంతోషం వ్యక్తం చేస్తు్న్నారు. కొందరు సినీ సెలబ్రిటీలు కూడా ఈ నిర్ణయంపై స్పందిస్తున్నారు. తాజాగా ప్రకాశ్ రాజ్ కూడా సాగు చట్టాల రద్దుపై తమదైన రీతిలో స్పందించారు.
సాగు చట్టాలపై పోరాటం చేస్తున్న క్రమంలో ఎందరో రైతులు ప్రాణాలు విడిచారు. ఆ రైతుల కుటుంబాలకు ఇప్పటివరకు ఎవరూ సరైన చేయూతను అందించలేకపోయారు. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. సాగు చట్టాల పోరాటంలో మరణించిన రైతుల కుటుంబాలకు రూ. 3 లక్షల నష్టపరిహారాన్ని ఇస్తామని హామీ ఇచ్చారు. కేంద్రాన్ని రూ.25 లక్షలు ఇవ్వమని డిమాండ్ చేశారు. ఇదే విషయాన్ని మంత్రి కేటీఆర్ తన ట్విటర్‌లో పేర్కొన్నారు.
కేటీఆర్ చేసిన ట్వీట్‌ను రీట్వీట్ చేసి ప్రకాశ్ రాజ్ ఈ విషయంపై స్పందించారు. సాగు చట్టాలను రద్దు చేసి సారీ చెప్తే సరిపోదు అన్నారు. 'డియర్ ప్రైమ్ మినిస్టర్.. సారీ మాత్రమే సరిపోదు. దీనికి పూర్తి బాధ్యత మీరు తీసుకుంటారా..? ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్తారా' అంటూ ట్వీట్ చేశారు ప్రకాశ్ రాజ్. అంతే కాక సాగు చట్టాల రద్దయిన సందర్భంగా 'అలుపెరగకుండా పోరాడి నా దేశ రైతులు.. రాజును మోకాళ్లపై కూర్చొబెట్టగలిగాయి' అని ఒక వీడియోను పోస్ట్ చేశారు.
Dear Prime Minister , SORRY is not enough .. Will you own up the responsibility.. and reach out #justasking https://t.co/BtgC1gZ89x
— Prakash Raj (@prakashraaj) November 21, 2021