కమెడియన్ గా పరిచయమైనా హీరోగానూ రాణిస్తున్నాడు ప్రియదర్శి. మల్లేశం సినిమాలోని నటనతో విమర్శకులను మెప్పించాడు. ఓ రకంగా చూస్తే కొన్నాళ్లుగా అతను కామెడీ పాత్రలేం చేయడం లేదు. జాతిరత్నాలు తర్వాత.. అన్నీ క్యారెక్టర్స్ చేస్తున్నాడు. అప్పుడప్పుడూ హీరోగా ఆకట్టుకుంటున్నాడు. ఇలాంటి వాళ్లు హీరోగా మెప్పించాలంటే కథలో మంచి పాయింట్ ఉండాలి. అలాంటి కంటెంట్స్ తోనే ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు ప్రియదర్శి. అతని కొత్త సినిమా పేరు ‘తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి’. సుమతీ శతకం నుంచి తీసుకున్న ఈ లైన్ కు తగ్గట్టుగానే ట్రైలర్ ఉంది.
ఒక దొంగ చాలా అవసరం వచ్చి దొంగతనం చేశాడు.. అతను మంచి వాడా చెడ్డవాడా అంటూ ఓ వ్యక్తి చిన్న పాపతో చెప్పే డైలాగ్ వాయిస్ తో మొదలైన ట్రైలర్ ... దొంగ కాబట్టి చెడ్డోడే అంటుందా పాప.. ఒక మంచి వాడు చాలా కష్టాల్లో ఉండి.. ఆ దొంగ దగ్గర నుంచి డబ్బు కొట్టేశాడు.. ఇతను మంచివాడా చెడ్డోడా అంటే.. మంచోడే కానీ చెడ్డోడై పోయాడుగా అని అంటుందా పాప.., చాలామంది మంచివాళ్లు.. చాలా కష్టాల్లో ఉండి.. చెడ్డవాడైన ఆ మంచి వాడి దగ్గర డబ్బులు కొట్టేశారు.. మరి వీళ్లందరినీ ఏమంటారు అని వ్యక్తి ప్రశ్న.. దానికి.. చెడ్డవాడి దగ్గరే కదా డబ్బులు కొట్టేసింది.. పైగా కష్టాల్లో ఉన్నారు. కాబట్టి మంచి వాళ్లే అంటుందా పాప. దీనికి.. ‘అవసరం లేకో అవకాశం రాకో మంచి వాళ్లుగా ఉన్నారు కానీ.. ఇప్పుడు మనుషులంతా పాటించేది ఒక్కటే.. ’ అనే డైలాగ్ తర్వాత ‘తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి’ అనే టైటిల్ కార్డ్ పడుతుంది. దీన్ని బట్టే ఈ కథ డబ్బు చుట్టూ తిరుగుతుంది. మానవ సంబంధాల నేపథ్యంలో సాగుతుంది అని అర్థం చేసుకోవచ్చు.
మరీ అంత గొప్పగా ఏం లేదు కానీ.. ఓకే అనిపించేలా ఉందీ ట్రైలర్. సింపుల్ గా చెబితే దొరికితే దొంగలు అనే పాయింట్ ప్రధానంగా కనిపిస్తోంది. ఈ గురువారం నుంచి ఆహాలో స్ట్రీమ్ కాబోతోందీ మూవీ. మరి ఈ మూవీతో ప్రియదర్శి ఎలాంటి రిజల్ట్ అందుకుంటాడో చూడాలి.