బుర్రిపాలెంలో సూపర్ స్టార్ కృష్ణ విగ్రహావిష్కరణ
సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఆయన సోదరుడు ఆదిశేషగిరిరావు;
టాలీవుడ్ లో సూపర్ స్టార్ కృష్ణ గురించి తెలియని వారుండరు. రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లోనూ తన డేరింగ్ అండ్ డాషింగ్ డెసీషీయన్స్ తో ఎంతో మందికి రోల్ మోడల్ గా మారారు. హీరోకు ప్రతిరూపంగా నిలిచే ఆయన వ్యక్తిత్వం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒకప్పుడు తెలుగు సినీ పరిశ్రమను ఆయన మరణ వార్త ఎంతో మందిని కలచివేసింది. ఈ క్రమంలో ఆయన చేసిన సేవలకు గుర్తుగా తాజాగా కృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అది కూడా ఎక్కడో కాదు. ఆయన సొంతూరైన బుర్రి పాలంలో.
గుంటూరు జిల్లా బుర్రిపాలెంలో జన్మించిన సూపర్ స్టార్ కృష్ణకు ఆయన కుటుంబసభ్యులు ఘనంగా నివాళి అర్పించారు. ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడంతో పాటు దేవుడు లాంటి అనే పుస్తకాన్ని కూడా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం అంతా కూడా కృష్ణ కుటుంబసభ్యుల చేతుల మీదుగా జరగగా.. ఈ వేడుకకు ఆయన సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, హీరో సుదీర్ బాబు , కృష్ణ గారి కుమార్తెలు పద్మావతి, మంజుల, ప్రియదర్శిని , జయ , రమేశ్ బాబు భార్య మృదుల, నన్నపనేని రాజకుమారి, నిర్మాతలు అచ్చిరెడ్డి, శాఖమూరి మల్లికార్జునరావు దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ వినాయకరావు రచించిన దేవుడు లాంటి మనిషి పుస్తకాన్ని సుధీర్ బాబు ఆవిష్కరించగా.. ఆదిశేషగిరిరావుకు తొలి కాపీ అందించారు.
బుర్రి పాలం గ్రామంలో అన్నయ్య విగ్రహం ఆవిష్కరించడం ఆనందంగా ఉందని నిర్మాత ఆదిశేషగిరిరావు సంతోషం వ్యక్తం చేశారు. అలాగే సీనియర్ జర్నలిస్ట్ వినాయకరావు గారు మూడేళ్ల పాటు శ్రమించి అద్భుతమైన సమాచారంతో దేవుడు లాంటి మనిషి పుస్తకం రాశారని, చరిత్రకు అద్దం పట్టే ఇలాంటి పుస్తకాల అవసరం ఎంతైనా ఉందని ఆయన చెప్పుకొచ్చారు.
తాను కూడా సినిమాను ఇష్టపడి, కష్టపడి ఈ రంగంలో కి వచ్చి అందరి అభిమానాన్ని పొందానని ఈ సందర్భంగా సుధీర్ బాబు చెప్పారు. బుర్రి పాలంలో జరిగిన కృష్ణ గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టం గా భావిస్తున్నానన్న ఆయన.. అలాగే వినాయకరావు గారు రాసిన ఈ అద్భుతమైన పుస్తకం తన చేతుల మీదుగా విడుదల కావడం చాలా ఆనందంగా ఉందన్నారు.
కృష్ణ గారు బుర్రిపాలెం ఒక రైతు కుటుంబం నుంచి సినీ పరిశ్రమకి వెళ్లి బుర్రిపాలెం బుల్లోడుగా కోట్లాది మంది ప్రేక్షకుల ప్రేమను పొందారని కృష్ణ కూతుళ్లు మంజుల, పద్మావతి చెప్పారు. ఆయనకి ఈ గ్రామం పై ఎంతో ప్రేమ ఉండేదని, ఈ గ్రామం గురించే ఎప్పుడు మాట్లాడుతూ ఉండేవారని, అలాంటిది ఇప్పుడు ఇక్కడ కృష్ణ గారి విగ్రహం ఏర్పాటు చేయడం ఆనందదాయకంగా ఉందని తెలిపారు.
కృష్ణ గారి కోరికతోనే ఈ పుస్తకాన్ని అదనపు హంగులతో రెండో సారి తీసుకు వచ్చానని పుస్తక రచయిత వినాయకరావు అన్నారు. అయితే ఈ పుస్తకాన్ని చూడకుండానే ఆయన ఆయన మనకు దూరం కావడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణ గారి విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా ఈ పుస్తకం విడుదల అవుతున్నందుకు ఆనందంగా ఉందని చెప్పారు. ఇక కృష్ణగారు ఎప్పటికీ నంబర్ వన్ దర్శకుడు కృష్ణారెడ్డి చెప్పారు. అటువంటి గొప్ప వ్యక్తి గురించి వినాయకరావు గారు పుస్తకం రాయడం అభినందనీయం అన్నారు.