Sudheer Babu: కేటీఆర్ మంచి నటుడు.. భవిష్యత్తులో నేను ఆయనలా.. : సుధీర్ బాబు
Sudheer Babu: రాజకీయ నాయకులు, సినిమా తారలు ఒకే వేదిక మీద కలవడం అప్పుడప్పుడు అరుదుగా జరుగుతుంది.;
Sudheer Babu: రాజకీయ నాయకులు, సినిమా తారలు ఒకే వేదిక మీద కలవడం అరుదుగా జరుగుతుంది. ఇరువురు తమదైన శైలిలో సంభాషిస్తూ సభలోని వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. తాజాగా యువ కథానాయకుడు సుధీర్ బాబు.. మంత్రి కేటీఆర్‌పై పంచ్‌లు వేసి సభలో నవ్వులు పూయించారు.
కేటీఆర్ వాటిని సీరియస్‌గా కాకుండా చిరునవ్వుతో స్వీకరించారు. హైదరాబాద్ హైటెక్స్‌లో జరుగుతున్న ఇండియా జాయ్ కార్యక్రమానికి సుధీర్ బాబు హాజరయ్యారు. వేడుకకు ముఖ్య అతిధిగా హాజరైన కేటీఆర్, సుధీర్ బాబుల మధ్య సరదా సంభాషణ సాగింది.
కార్యక్రమంలో సుధీర్ బాబు మాట్లాడుతూ.. కేటీఆర్‌కు నేను పెద్ధ అభిమానిని. ఆయనలో ఒక మంచి నటుడు కూడా ఉంటాడు. ఒక నటుడు అన్నీ మరిచిపోయి తన పాత్రకు న్యాయం చేయాలి. అలాగే రాజకీయ నాయకులు కూడా ప్రజలకు సేవ చేయాలంటే తన గురించి, కుటుంబం గురించి మరిచిపోయి పనిచేయాలి. అలాంటి వ్యక్తి కేటీఆర్. ఆయన విజన్ చాలా బావుంటుంది.
భవిష్యత్తులో నేను పొలిటికల్ డ్రామా సినిమా చేయాల్సివస్తే కేటీఆర్‌ని అనుసరిస్తా అని అంటూనే ఆయన సినిమాల్లోకి రానందుకు ఆనందంగా ఉంది అని అన్నారు సుధీర్ బాబు.
దానికి కేటీఆర్ స్పందిస్తూ.. సుధీర్ నన్ను నటుడ్ని చేశాడు.. నేను రాజకీయ నటుడిగా కాకుండా నటుడిగా కనిపిస్తున్నానా.. ఈ విషయాన్ని నేను మనసులో పెట్టుకుంటా.. అంటూ సుధీర్‌ని కాసేపు ఆటపట్టించారు. కంగారు పడకు.. నీ మాటల్ని నేను పాజిటివ్‌గా తీసుకుంటున్నా.. ధన్యవాదాలు సుధీర్ అని అనడంతో నవ్వులు పూశాయి.