మొతేరా టెస్టులో టీమిండియా ఘనవిజయం..!
తొలి ఇన్నింగ్స్‌లో 205 పరుగులు మాత్రమే చేసిన రూట్ సేన... రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 135 పరుగులకే ఆలౌట్ అయ్యారు.;
మోతేరాలో భారత్ విక్టరీ మోత మోగించింది. భారత స్పిన్నర్ల ధాటికి ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ విలవిలలాడారు. తొలి ఇన్నింగ్స్‌లో 205 పరుగులు మాత్రమే చేసిన రూట్ సేన... రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 135 పరుగులకే ఆలౌట్ అయ్యారు. టీమిండియా స్పిన్ ట్విన్స్... అక్షర్, అశ్విన్ ఐదేసి వికెట్లతో ఇంగ్లిష్ బ్యాట్స్‌మెన్ పతనాన్ని శాసించారు. దీంతో టెస్టు సిరీస్‌ను భారత్ 3 -1 తేడాతో గెలుచుకుంది. ఈ విజయంతో జూన్‌లో లార్డ్స్ వేదికగా జరగనున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌కు భారత్ అర్హత సాధించింది...
భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 365 పరుగులకు ఆలౌట్ అయింది. నిన్న రిషబ్ పంత్ సెంచరీతో అదరగొట్టగా.. ఇవాళ స్పిన్నర్లు వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ ఇంగ్లండ్ బౌలర్లను ఆటాడుకున్నారు. ముఖ్యంగా సుందర్ అద్భుత బ్యాటింగ్ నైపుణ్యం కనబరుస్తూ 96 పరుగులు చేశాడు. అయితే 43 పరుగుల వద్ద అక్షర్ పటేల్ రనౌట్ అయ్యాడు. అంతలోనే మిగతా రెండు వికెట్లు కూడా పడిపోవడంతో సుందర్‌కు సెంచరీ చేసే అవకాశం మిస్ అయింది.