IND VS ENG.. టెస్టులో అదరగొట్టిన టీమిండియా.. విలవిల్లాడిన ఇంగ్లండ్
IND VS ENG. స్పిన్‌ను ఎదుర్కొనలేక విలవిల్లాడిన ఇంగ్లండ్ కేవలం 112 పరుగులకే ఆలౌట్ అయింది.;
IND VS ENG.. మొతెరా టెస్టులో టీమిండియా అదరగొట్టింది. తొలిరోజే మ్యాచ్‌పై పట్టుబిగించింది. అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్‌లో అదరగొట్టింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్‌ను అక్షర్ పటేల్, అశ్విన్ దెబ్బకొట్టారు. తొలిరోజు నుంచే స్పిన్‌కు అనుకూలించిన పిచ్‌ను చక్కగా ఉపయోగించుకున్నారు. చక్కటి బంతులతో ఇంగ్లిష్ బ్యాట్స్‌మెన్‌కు చుక్కలు చూపెట్టారు...ముఖ్యంగా అక్షర్ పటేల్ మరోసారి విజృంభించాడు.. 38 పరుగులకే ఆరు వికెట్లు తీశాడు. అటు మరో సీనియర్ స్పిన్నర్ అశ్విన్ కూడా 3 వికెట్లు పడగొట్టాడు. స్పిన్‌ను ఎదుర్కొనలేక విలవిల్లాడిన ఇంగ్లండ్ కేవలం 112 పరుగులకే ఆలౌట్ అయింది.
ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు శుభారంభమే అందించారు. రోహిత్ శర్మ చూడచక్కని ఆటతో ఆకట్టుకుంటే.. మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఫర్వాలేదనిపించాడు. జట్టు స్కోరు 33 వద్ద గిల్ ను ఆర్చర్ ఔట్ చేశాడు. ఈ క్రమంలో విరాట్‌తో కలిసిన హిట్‌మ్యాన్ అద్భుతంగా ఆడాడు. అందివచ్చిన బంతుల్ని బౌండరీకి తరలించాడు. సొగసైన పుల్, కవర్ షాట్లతో అలరించాడు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 64 పరుగుల భాగస్వామ్యం అందించారు. ఇక తొలిరోజు విజయవంతంగా ముగిసిందని భావించేలోగా ఆఖరి ఓవర్ రెండో బంతికి కోహ్లీని లీచ్ పెవిలియన్ పంపించాడు. ప్రస్తుతం భారత్ 3 వికెట్లు కోల్పోయి 99 రన్స్ చేసింది . క్రీజులో రోహిత్ శర్మ, అజింక్య రహానే ఉన్నారు..