ఇంగ్లండ్‌పై ప్రతీకారం తీర్చుకున్న భారత్
ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా రెండో మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది.;
తొలి టీ20లో ఇంగ్లండ్ చేతిలో ఎదురైన పరాభవానికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా రెండో మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఇంగ్లండ్ నిర్ధేశించిన 165 పరుగుల లక్ష్యాన్ని 17.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి సునాయాసంగా చేధించింది. ఈ విజయంతో సిరీస్‌ను 1-1తో సమం చేసింది టీమిండియా. మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన కోహ్లీ.. 49 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సులతో 73 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. అరంగేట్ర బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిషన్ 32 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సులతో 56 పరుగులు చేయడంతో టీమిండియా.. ప్రత్యర్ధిపై 7 వికెట్ల తేడాతో గెలుపొందింది.
అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టు ఓపెనర్లు విఫలం చెందారు. భువనేశ్వర్ కుమార్ తొలి ఓవర్‌లోనే ప్రమాదకరమైన జాస్ బట్లర్‌ను LBW చేయడంతో డకౌట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత జేసన్ రాయ్, డేవిడ్ మలన్ కలసి జట్టు స్కోర్‌ను పరుగెత్తించారు. అయితే ప్రపంచ నెంబర్ వన్ టీ 20 బ్యాట్స్‌మాన్ డేవిడ్ మలన్ 24 పరుగుల వద్ద యజువేంద్ర చాహల్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. జేసన్ రాయ్‌తో కలసి జానీ బెయిర్‌స్టో దూకుడును కొనసాగించాడు.
తొలి టీ20లో ఒక పరుగు తేడాతో అర్దసెంచరీ కోల్పోయిన రాయ్.. ఈ మ్యాచ్‌లో 46 పరుగుల వద్ద అవుటయ్యాడు. వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించగా భువనేశ్వర్ కుమార్ ఏ మాత్రం పొరపాటు చేయకుండా క్యాచ్ పట్టాడు. ఆ తర్వాత జానీ బెయిర్ స్టో, కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, బెన్ స్టోక్స్ భారీ స్కోర్ కోసం ప్రయత్నించారు. అయితే చివర్లో భారత పేసర్లు పరుగులు రాకుండా అడ్డుకున్నారు. దీంతో ఇంగ్లాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 164 పరుగులు మాత్రమే చేయగలిగింది. శార్దుల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్ చెరి 2 వికెట్లు తీయగా.. భువీ, చాహల్ ఒక్కో వికెట్ తీశారు. ఇరుజట్ల మధ్య మూడో టీ20 మ్యాచ్ అహ్మదాబాద్‌లోనే రేపు జరగనుంది.