IPL 2022 Auction: ముగిసిన ఐపీఎల్ 2022 ఆక్షన్.. హైలెట్ ఏంటంటే..
IPL 2022 Auction: రెండు రోజుల పాటు జరిగిన IPL-2022 మెగా వేలంలో ప్లేయర్స్‌ను దక్కించుకునేందుకు ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి.;
IPL 2022 Auction: రెండు రోజుల పాటు జరిగిన IPL-2022 మెగా వేలంలో ప్లేయర్స్‌ను దక్కించుకునేందుకు పది ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. మొత్తంగా 217 మంది ప్లేయర్స్‌ను కొనే అవకాశం ఉండగా.. అన్ని జట్లు కలిపి 204 మంది ప్లేయర్స్‌ను కొన్నాయి. ఇందులో ఇండియన్ ప్లేయర్స్ 137 మంది ఉండగా.. ఫారిన్ ప్లేయర్స్ 67 ఉన్నారు. ఈ సీజన్ వేలంలో అన్ని జట్లు కలిపి 551 కోట్ల 70 లక్షలు ఖర్చు చేశాయి.
ఎప్పటిలాగే కొంత మంది ప్లేయర్స్ ఊహించని ధర పలుకగా.. మరి కొందరు ప్లేయర్స్ తక్కువ ధరతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మరికొందరు స్టార్ ప్లేయర్లను కొనేందుకు ఏ జట్టు ఆసక్తి చూపకపోవడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. మొత్తంగా ఈ సీజన్‌లో టీమిండియా ప్లేయర్ ఇషాన్ కిషన్‌ను.. అత్యధికంగా 15 కోట్ల 25 లక్షలకు సొంతం చేసుకుంది ముంబై ఇండియన్స్.
తర్వాతి స్థానాల్లో దీపక్ చాహర్ ఉన్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ దీపక్ చాహర్‌ను 14 కోట్లకు సొంతం చేసుకోగా.. కోల్‌కతా నైట్ రైడర్స్ శ్రేయస్ అయ్యర్‌ను 12 కోట్ల 25 లక్షలకు కొనుగోలు చేసింది. ఇక రెండో రోజు జరిగిన వేలంలో ఇంగ్లండ్ ప్లేయర్ లివింగ్ స్టోన్‌ను 11 కోట్ల 50 లక్షలకు పంజాబ్ సొంతం చేసుకుంది. విండీస్ ప్లేయర్ ఓడియన్ స్మిత్ కోసం పంజాబ్ 6 కోట్లు ఖర్చు చేయగా.. ఇంగ్లండ్ బౌలర్ జోఫ్రా ఆర్చర్‌ను 8 కోట్లకు సొంతం చేసుకుంది ముంబై ఇండియన్స్.
ఇక సింగపూర్ ప్లేయర్ టిమ్ డేవిడ్ కోసం ఏకంగా 8 కోట్ల 25 లక్షలు ఖర్చు చేసింది ముంబై ఇండియన్స్. దీంతో అన్ క్యాప్‌డ్ ప్లేయర్లలో అత్యధిక ధర పలికిన ప్లేయర్‌గా నిలిచాడు డేవిడ్. మహేంద్ర సింగ్ ధోని, రవీంద్ర జడేజా, మొయిన్ అలీ, రుతురాజ్ గైక్వాడ్‌లను రిటైన్ చేసుకున్న CSK...మిగిలిన ప్లేయర్స్ కోసం 48 కోట్లతో మెగా వేలంలోకి వచ్చింది.
ఆక్షన్‌లో అత్యధికంగా దీపక్ చాహర్ కోసం 14 కోట్లు ఖర్చు చేసింది. తర్వాత అంబటి రాయుడు 6 కోట్ల 75 లక్షలు, డ్వేన్ బ్రావో కోసం 4 కోట్ల 40 లక్షలు, శివం దూబే కోసం 4 కోట్లు ఖర్చు చేసింది. ముంబై ఇండియన్స్ యంగ్ ప్లేయర్స్‌కు ప్రాధాన్యత ఇచ్చింది. రోహిత్ శర్మ, బుమ్రా, కీరన్ పొలార్డ్, సూర్య కుమార్‌లను తన దగ్గరే ఉంచుకున్న ముంబై జట్టు..ఇషన్ కిషాన్‌కు 15 కోట్ల 25 లక్షలు ఖర్చు చేసింది. తర్వాత సింగపూర్ ప్లేయర్ టిమ్ డేవిడ్‌కు 8 కోట్ల 25 లక్షలు ఖర్చు చేసింది.
ఇక ఐపీఎల్ కప్ కోసం ఎదురుచూస్తున్న ఆర్సీబీ.. ప్లేయర్ల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంది. ఇప్పటికే స్టార్ ప్లేయర్స్ విరాట్ కోహ్లీ,మాక్స్‌వెల్, సిరాజ్‌లను రిటెయిన్ చేసుకున్న ఆర్సీబీ వేలంలో టాప్ ఆటగాళ్లను కొనుగోలు చేసింది. శ్రీలంక ప్లేయర్ వానిందు హసరంగకు అత్యధికంగా పది కోట్ల 75 లక్షలు ఖర్చు చేసింది. సౌతాఫ్రికా ప్లేయర్ డుప్లేసిస్‌ను 7 కోట్లకు సొంతం చేసుకున్న ఆర్సీబీ.. హేజిల్‌వుడ్ కోసం 7 కోట్ల 75 లక్షలు పెట్టింది.
టీమిండియా సీనియర్ ప్లేయర్ దినేష్ కార్తీక్‌ను 5 కోట్ల 50 లక్షలకు సొంతం చేసుకుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇప్పటికే కేన్ విలియమ్సన్‌తో పాటు అన్‌క్యాప్‌డ్ ప్లేయర్స్ ఉమ్రాన్ మాలిక్, సమద్‌ను అట్టిపెట్టుకుంది. వార్నర్, బెయిర్ స్టో లాంటి స్టార్ ఆటగాళ్లను వదిలేసి వేలంలోకి వెళ్లింది. వేలంలో వాషింగ్టన్ సుందర్‌ను 8 కోట్ల 75 లక్షలకు కొనుగోలు చేసిన సన్ రైజర్స్ యాజమాన్యం..విండీస్ ప్లేయర్ నికోలస్ పూరన్ కోసం 10 కోట్ల 75 లక్షలు పెట్టింది.
వీరితో పాటు బౌలర్లు భువనేశ్వర్, నటరాజన్‌లను మళ్లీ కొనుగోలు చేసింది. ఇక ఢిల్లీ కేపిటల్స్.. రిషబ్ పంత్, నోర్జే, అక్షర్ పటేల్, పృథ్వీ షాను తనతో పాటు ఉంచుకోగా.. వేలంలో 47 కోట్ల 5 లక్షలు ఖర్చు చేసింది. డేవిడ్ వార్నర్‌ను 6 కోట్ల 25 లక్షలకు తీసుకుంది. అత్యధికంగా శార్దూల్ ఠాకూర్ కోసం పది కోట్ల 75 లక్షలు ఖర్చు చేసింది. మిచెల్ మార్ష్‌ను 6 కోట్ల 50 లక్షలకు సొంతం చేసుకుంది.
ఇక ఐపీఎల్‌లోకి కొత్తగా ఎంట్రీ ఇవ్వబోతున్న గుజరాత్ టైటాన్స్..వేలం కంటే ముందే హార్ధిక్ పాండ్యా, రషీద్ ఖాన్, శుభ్‌మన్ గిల్‌లను సొంతం చేసుకుంది. హార్ధిక్ పాండ్యాను కెప్టెన్‌గా ప్రకటించిన ఈ జట్టు వేలంలో ఫెర్గూసన్ కోసం పది కోట్లు ఖర్చు చేసింది. రాహుల్ తెవాతియాను 9 కోట్లు, షమీ 6 కోట్ల 25 లక్షలకు సొంతం చేసుకుంది.
ఇక షారూఖ్ ఖాన్‌కు చెందిన కోల్‌కతా నైట్ రైడర్స్.. సునీల్ నరైన్, ఆండ్రూ రస్సెల్, వరుణ్ చక్రవర్తి, వెంకటేష్ అయ్యర్ లాంటి ప్లేయర్లను రిటెయిన్ చేసుకుంది. వేలంలో శ్రేయస్ అయ్యర్‌ను భారీ ధరకు కొనుగోలు చేసింది. అయ్యర్ కోసం ఏకంగా 12 కోట్ల 25 లక్షలు ఖర్చు చేసింది కేకేఆర్. నితీష్ రాణా 8 కోట్లు, శివమ్ మావి 7 కోట్ల 25 లక్షలు, కమ్మిన్స్‌ను 7 కోట్ల 25 లక్షలకు కొనుగోలు చేసింది.
కొత్త ఫ్రాంఛైజీల్లో ఒకటైన లక్నో సూపర్ జెయింట్స్..కెఎల్ రాహుల్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసుకుంది. మార్కస్ స్టొయినిస్,రవి బిష్ణోయ్‌లను రిటెయిన్ చేసుకుంది. ఇక వేలంలో అవేష్ ఖాన్ కోసం 10 కోట్లు, జాసన్ హోల్డర్ కోసం 8 కోట్ల 75 లక్షలు ఖర్చు చేసిన లక్నో.. కృనాల్ పాండ్యాను 8 కోట్ల 25 లక్షలు, మార్క్ వుడ్‌ను 7 కోట్ల 50 లక్షలకు సొంతం చేసుకుంది. వీరితో పాటు సౌతాఫ్రికా ఓపెనర్ క్వింటన్ డికాక్, మనీష్ పాండే, దీపక్ హుడా లాంటి ప్లేయర్లను కొనుగోలు చేసింది.
ప్రీతి జింతాకు చెందిన పంజాబ్ కింగ్స్ ఎలెవన్ టీమ్....మయాంక్ అగర్వాల్, అర్షదీప్ సింగ్‌ను మాత్రమే రిటెయిన్ చేసుకుంది. వేలంలో ఇంగ్లండ్ ప్లేయర్ లివింగ్ స్టోన్‌ను 11 కోట్ల 50 లక్షలకు సొంతం చేసుకుంది. సౌతాఫ్రికా బౌలర్ కగిసో రబడాను 9 కోట్ల 25 లక్షలకు కొనుగోలు చేసింది. వీరితో పాటు శిఖర్ ధావన్, బెయిర్ స్టో, రాహుల్ చాహర్, ఒడియన్ స్మిత్‌లను వేలంలో సొంతం చేసుకుంది.
ఇక ఐపీఎల్ టోర్నీలో మొదటి కప్‌ను సొంతం చేసుకున్న రాజస్థాన్ రాయల్స్.. మెగా వేలంలో కొత్త ఆటగాళ్లకు ప్రాధాన్యమిచ్చింది. సంజు శాంసన్, బట్లర్, యశస్వీ జైస్వాల్‌లను రిటెయిన్ చేసుకున్న ఈ జట్టు.. వేలంలో ప్రసిద్ధ్ కృష్ణను పది కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. ట్రెంట్ బౌల్ట్ కోసం 8 కోట్లు, హెట్ మేయర్ కోసం 8 కోట్ల 50 లక్షలు, దేవదత్ పడిక్కల్ కోసం 7 కోట్ల 75 లక్షలు, చాహల్ కోసం 6 కోట్ల 50 లక్షలు ఖర్చు చేసింది. వీరితో పాటు రవిచంద్రన్ అశ్విన్, రియాన్ పరాగ్, జేమ్స్ నీషమ్, కరణ్ నాయర్, నవ్‌దీప్ షైనీలను వేలంలో కొనుగోలు చేసింది.
ఈ మెగావేలంలో కొందరు స్టార్ ఆటగాళ్లకు నిరాశ తప్పలేదు. మిస్టర్ ఐపీఎల్, చెన్నై సూపర్ కింగ్స్ చిన్న తలాగా పేరున్న సురేష్ రైనాను కొనేందుకు ఏ జట్టు ముందుకు రాలేదు. కనీసం బేస్ ప్రైస్ దగ్గర కూడా ఏ జట్టు ఆసక్తి చూపలేదు. రైనాతో పాటు స్టీవ్ స్మిత్, షకీబ్ అల్ హసన్, ఇయాన్ మోర్గాన్, ఇషాంత్ శర్మ, గప్తిల్, కేదార్ జాదవ్, బ్రాత్ వైట్, పుజారా, హనుమ విహారి లాంటి కీలక ప్లేయర్స్ వేలంలో అమ్ముడు పోలేదు.