T20 World Cup: వరల్డ్ కప్‌లో టీమిండియాకు ఏమైంది..? వారి ఓటమికి కారణాలు ఇవేనా..?
T20 World Cup: టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా ఆడిన తీరు క్రికెట్ లవర్స్ అందరినీ నిరాశపరిచింది.;
T20 World Cup (tv5news.in)
T20 World Cup: టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా ఆడిన తీరు క్రికెట్ లవర్స్ అందరినీ నిరాశపరిచింది. ఫైనల్ వరకు చేరే మాట పక్కన పెడితే.. కనీసం సెమీస్‌కు అయినా వెళ్తుందా లేదా అన్న అనుమానాలు మొదలయిపోయాయి అందరికీ. ఈ సమయంలో అందరికీ అర్థం కాని ప్రశ్న ఒక్కటే. అసలు టీమిండియా ఎందుకు ఇలా అయిపోయింది. ఎప్పుడు లేనిది పాకిస్థాన్ చేతిలో ఓడడానికి కారణాలేంటి అని..
ఏపీఎల్‌లో ప్రతీ ఒక్క టీమిండియా ప్లేయర్ ఎంత బాగా ఆడారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పరుగులు, రన్ రేట్ విషయంలో ఒకరికి ఒకరి గట్టి పోటీనే ఇచ్చారు. అదే వరల్డ్ కప్ విషయానికి వచ్చేసరికి ఒక్క టాప్ ఆర్డర్ ప్లేయర్ కూడా ఆశించినంతగా ఆడలేకపోయారు. ఒక్కొక్కసారి మినిమమ్ పరుగులు కూడా స్కోర్ చేయలేక వెనకబడిపోయారు. పాకిస్థాన్‌తో ఆడిన మ్యా్చ్‌లో కాస్త పరవాలేదనిపించినా.. న్యూజిలాండ్ మ్యాచ్‌లో మాత్రం టీమ్ అంతా కలిసి సెంచరీ చేయడానికే కష్టపడ్డారు. దీంతో టీమ్‌లో యూనిటీ లేదు అన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.
బ్యాటింగ్ విషయంలో కాస్త వెనకబడినా. డిఫెండ్ చేసి గెలవచ్చులే అనుకునే పరిస్థితి కూడా లేదు. టీమిండియాలో ఇతర టీమ్‌లను భయపెట్టే బౌలర్స్ ఎక్కువ సంఖ్యలో లేరు అన్నది ఓపెన్ సీక్రెట్. ఇదే విషయం టీ20 వరల్డ్ కప్ ద్వారా మరోసారి నిరూపణ అయ్యింది. బూమ్రా మాత్రమే అంతో ఇంతో వికెట్లు తీయడంలో సహాయపడ్డాడు. వరుణ్ చక్రవర్తి అయితే తనపై పెట్టుకున్న అంచనాలు అందుకోలేక కష్టపడుతున్నాడు. పేసర్లు కూడా ప్రేక్షకులను డిసప్పాయింట్ చేస్తూనే ఉన్నారు.
విరాట్ కోహ్లీలో ఇంతకు ముందు ఉన్న ఫైర్ కనిపించట్లేదు. కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న కొత్తలో విరాట్.. ఎన్నో ఓడిపోతాయనుకున్న మ్యాచ్‌లను గెలిపించాడు. ఇప్పుడు తనలో ఆ పట్టు కనిపించట్లేదు. తన ఆట పట్ల వస్తున్న నెగిటివిటీని తట్టుకోలేక.. టీ20 వరల్డ్ కప్ తర్వాత కెప్టెన్సీని వదిలేసుకుంటానని ప్రకటించాడు. అందుకే కెప్టెన్‌గా చివరి మ్యాచ్ కాబట్టి వరల్డ్ కప్‌లో తన ప్రతాపం చూపిస్తారు అనుకున్నారంతా. కానీ అందరి అంచనాలు తారుమారయ్యాయి.
ఆటలో గెలవాలంటే ఏకాగ్రతతో పాటు ఒత్తిడి లేకపోవడం కూడా ముఖ్యం. టీమిండియాపై ఉన్న అంచనాల వల్ల వారికి రోజురోజుకీ ఒత్తిడి పెరిగిపోతోంది. అంతే కాకుండా సమ్మర్‌లో జరగాల్సిన ఐపీఎల్ ఈసారి ఆలస్యంగా జరిగాయి. ఐపీఎల్ ముగిసిన కొన్నిరోజులకే టీ20 వరల్డ్ కప్ వచ్చేసింది. దీంతో టీమిండియా అలసిపోయిందని కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. దీనికి తోడు చాలామంది ఆటగాళ్లకు హోమ్ సిక్ కూడా ఒత్తిడికి కారణమవ్వొచ్చు.
ఒకసారి చేసిన తప్పులను తెలుసుకుని, వాటిని సరిదిద్దుకోవడమే మంచిది.. అది ఆటలో అయినా.. లైఫ్‌లో అయినా.. కానీ టీమిండియాకు ఈ సూత్రం అర్థం కావట్లేదేమో.. చేసిన తప్పులనే మళ్లీ మళ్లీ చేస్తున్నారు. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఓడిపోయిన తర్వాత టీమిండియా ఒత్తిడికి గురికావడం సహజమే కానీ.. కొంచెం ఏకాగ్రతతో ఆలోచించి మొదటి మ్యాచ్‌లో జరిగిన తప్పులను సరిదిద్దుకుని ఉంటే న్యూజిలాండ్‌తో మ్యాచ్ అలా జరిగేది కాదేమో అని ఫ్యాన్స్ విమర్శిస్తున్నారు. పైగా మొదటి మ్యాచ్ కంటే రెండో మ్యాచ్‌లో టీమిండియా పర్ఫార్మెన్స్ మరింత ఘోరంగా మారింది.