Sachin About Shane Warne: ఆటలో శత్రువులుగా మారిన సచిన్, వార్న్.. ఎందుకలా..?

Sachin About Shane Warne: ఆటలో ఇద్దరు దిగ్గజాలు తలపడితే ఆ మజా వేరుగా ఉంటుంది.

Update: 2022-03-05 06:33 GMT

Sachin About Shane Warne: ఆటలో ఇద్దరు దిగ్గజాలు తలపడితే ఆ మజా వేరుగా ఉంటుంది. ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయించే ప్రయత్నం చేస్తుంటారు. కానీ.. ఎదురుపడిన ప్రతీసారి ఒక్కరే ఆధిపత్యం ప్రదర్శిస్తే ఎలా ఉంటుంది. అచ్చం అలాంటిదే పరిస్థితినే ఎదుర్కొన్నాడు స్పిన్ బౌలర్ షేన్‌ వార్న్‌.. అది కూడా భారత్‌ క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ వల్ల. తన బౌలింగ్‌తో ఎందరో మేటి ఆటగాళ్లను ముప్పతిప్పలు పెట్టిన వార్న్‌కు సచిన్‌ మాత్రం కొరకరాని కొయ్యగా తయారయ్యాడు.

అంతర్జాతీయ క్రికెట్‌లో వార్న్‌- సచిన్‌లు 29 సార్లు ముఖాముఖి తలపడితే.. అందులో కేవలం నాలుగుసార్లు మాత్రమే సచిన్‌ని వార్న్ ఔట్ చేయడం విశేషం.టెస్టు సిరీస్ ల సందర్బంగా.. చెన్నై, కాన్పూర్, అడిలైడ్, మెల్బోర్న్ లలో జరిగిన మ్యాచులలో మాత్రమే సచిన్ వార్న్ కు ఔటయ్యాడు. మిగిలిన సందర్బాల్లో మాస్టర్ బ్లాస్టర్ దే పైచేయి. 1998 షార్జా కప్‌లో ఆస్ట్రేలియాపై మ్యాచ్‌లో సచిన్‌ 148 పరుగులు తుఫాన్‌ ఇన్నింగ్స్‌తో మెరిశాడు.

ఈ మ్యాచ్‌లో వార్న్‌కు సచిన్‌ తన బ్యాటింగ్‌తో చుక్కలు చూపించాడు. ఇదొక్కటి చాలు సచిన్‌- వార్న్‌ల వైరం ఏ రేంజ్‌లో ఉండేదో చెప్పుకోవడానికి. ఒక సందర్భంలో సచిన్‌ హిట్టింగ్‌కు తాను కొన్నేళ్ల పాటు నిద్రలేని రాత్రులు గడిపానని షేన్ వార్న్ స్వయంగా చెప్పుకోవడం విశేషం. ఇక ఈ జోడీ మధ్య వైరం క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ ఇలాగే నిలిచిపోతుంది. అయితే ఆటలో మాత్రమే సచిన్‌- వార్న్‌లు శత్రువులు.. బయట మాత్రం మంచి మిత్రులు. ఎక్కడ కలిసినా ఈ ఇద్దరి మధ్య మంచి సంభాషణ జరిగేది.

కాగా తన ఆప్తమిత్రుడు వార్న్‌ భౌతికంగా దూరమవడం సచిన్‌ను కలిచివేసింది. వార్న్‌కు కన్నీటి నివాళి అర్పించాడు సచిన్. చాలా చిన్న వయసులో వెళ్లిపోయావ్ మిత్రమా.. అంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. "దిగ్బ్రాంతికరమైన వార్త.. వార్న్ నిన్ను చాలా మిస్ అవుతాను. మన ఆన్ ఫీల్డ్, ఆఫ్ ఫీల్డ్ చర్యలు ఎల్లప్పుడూ విలువైనదిగా పరిగణిస్తాను.. భారత్ లో నీకు ప్రత్యేకమైన స్థానం ఉంది" అంటూ ట్వీట్‌ చేశాడు సచిన్.

Tags:    

Similar News