Sunil Gawaskar: హ్యాపీ బర్త్ డే 'లిటిల్ మాస్టర్' సన్నీ

Update: 2023-07-10 08:33 GMT

భారత క్రికెట్ చరిత్రలో సచిన్‌కి ముందు తరం సచిన్‌ సునీల్ గవాస్కర్. భయంకరమైన కరీబియన్ బౌలర్లను ఎదుర్కొని, ఆ తరం కుర్రకారు క్రికెట్‌కి ఆకర్షితులవ్వడానికి, టీవీలను అతుక్కునేలా చేసిన బ్యాట్స్‌మెన్ అతను. ఇప్పటి తరం ఆటగాళ్లు పలు రికార్డులు బద్దలు కొడుతుండగా, ఆ రికార్డులకు ఆధ్యుడిగా సునీల్ గవాస్కర్ ఉన్నాడు. ముంబయిలో 1949లో జన్మించాడు. అభిమానులు ముద్దుగా 'లిటిల్ మాస్టర్', 'సన్నీ' అని ముద్దుగా పిలుచుకునే భారత లెజెండరీ ఆటగాడు, మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ 74వ పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు.


క్రికెట్ చరిత్రలో 10,000 పరుగుల మార్క్ దాటిన మొట్టమొదటి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఓపెనర్‌గా బరిలో దిగే సన్నీ భారత జట్టు తరఫున 125 టెస్టులు ఆడి 51.1 సగటుతో 10,122 పరుగులు సాధంచాడు. అందులో 34 సెంచరీలు, 45 అర్ధసెంచరీలు సాధించాడు. 108 వన్డేల్లో 35.1 సగటుతో 2092 పరుగులు చేశాడు.


అప్పట్లో విండీస్‌తో పోరు అంటే బ్యాట్స్‌మెన్ జడిసేవారు. అప్పటి అరివీర భయంకరమైన జట్టులో దిగ్గజ ఆటగాళ్లు హోల్డింగ్స్, మార్షల్, గార్నర్ వంటి బౌలింగ్‌ ధాటికి బ్యాట్స్‌మెన్ గాయాలయపాలయ్యేవారు. అటువంటి విండీస్ బౌలర్లను అలవోకగా ఎదుర్కోవడమే కాకుండా, విండీస్‌తో ఆడిన 27 టెస్టుల్లో ఏకంగా 13 సెంచరీలు సాధించాడు.తన తొలి విదేశీ పర్యటన విండీస్‌లో సెంచరీ చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. అలాగే తన మొదటి సిరీస్‌లోనే ఒక డబుల్ సెంచరీతో పాటు మొత్తం 774 పరుగులు చేసి క్రికెట్ ప్రపంచానికి తనను తాను పరిచయం చేసుకున్నాడు. సునీల్ గవాస్కర్ ఆడే కాలంలో అత్యధిక సెంచరీల రికార్డు చాలా కాలం పాటు అతడి పేరు మీదే ఉండేది. తన చివరి టెస్ట్‌లో గవాస్కర్ డబుల్ సెంచరీ చేయడం విశేషం. ఆ మ్యాచ్‌లో భారత జట్టు చేసిన మొత్తం 427 పరుగుల్లో గవాస్కర్ 220 పరుగులు చేసి మ్యాచ్‌ని డ్రా వైపు నడిపించమే కాకుండా, కరీబియన్ దీవుల్లో భారత్‌ మొట్టమొదటి టెస్ట్ సిరీస్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. సచిన్ వచ్చి బద్దలు కొట్టేముందు వరకు కూడా బ్యాటింగ్‌లో పలు రికార్డులు సన్నీపైనే లిఖించి ఉన్నాయి.


1982లో భారత క్రికెట్ జట్టు గెలిచిన మొట్టమొదటి వరల్డ్‌కప్‌లో సభ్యుడు కూడా. వికెట్ కీపర్లను లెక్కలోకి తీసుకోనట్లయితే టెస్ట్ క్రికెట్‌లో మొత్తంగా 108 క్యాచ్‌లతో, భారత తరఫున 100 క్యాచ్‌ల మార్క్‌ను దాటిన మొదటి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ICC 2009లో సన్నీని ICC హాల్ ఆఫ్ ఫేంలో చేర్చింది. 1987లో క్రికెట్‌కి గుడ్‌బై చెప్పిన సన్నీ ప్రస్తుతం ప్రముఖ కామెంటేటర్‌గా ఉంటూ మ్యాచ్‌ విశ్లేషణలు చేస్తున్నాడు.

Tags:    

Similar News