T20 World Cup : టీ20 ప్రపంచకప్ వేదికలు యూఏఈకి తరలింపు..!
ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ వేదికలు యూఏఈ, ఒమన్‌కు మారాయని ఐసీసీ అధికారికంగా ప్రకటించింది.;
ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ వేదికలు యూఏఈ, ఒమన్‌కు మారాయని ఐసీసీ అధికారికంగా ప్రకటించింది. అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకు మెగా టోర్నీ జరుగుతుందని వెల్లడించింది. భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ బీభత్సం సృష్టించిన నేపథ్యంలో వరల్డ్‌కప్ టోర్నీ నిర్వహణ వేదికలను మార్చాల్సి వచ్చిందని తెలిపింది. బీసీసీఐ ఆతిథ్యంలోనే ఈ టోర్నీ మొత్తం జరుగనుందని ఐసీసీ స్పష్టం చేసింది.
టోర్నీ ప్రాథమిక దశలో ఎనిమిది జట్లు రెండు బృందాలుగా విడిపోయి ఒమన్, యూఏఈలో తలపడతాయి. అందులో నాలుగు జట్లు సూపర్-12 రౌండ్‌కు అర్హత సాధిస్తాయి. నేరుగా అర్హత సాధించిన ఎనిమిది జట్లతో కలిసి ఆడతాయి. ప్రాథమిక దశలో బంగ్లాదేశ్, శ్రీలంక, ఐర్లాండ్, నెదర్లాండ్స్, స్కాట్లాండ్, నమీబియా, ఒమన్, పపువా న్యూగినీ జట్లు ఆడనున్నాయి.
ఐసీసీ టీ20 ప్రపంచకప్-2021ను అందుబాటులో ఉన్న విండోలో సురక్షితంగా నిర్వహించడమే లక్ష్యమని ఐసీసీ తాత్కాలిక సీఈవో జెఫ్ అలార్డిస్ తెలిపారు. బహుళ జట్లతో మెరుగైన వాతావరణం సృష్టించగల దేశంలోనే పోటీలు పెట్టాలని నిర్ణయించుకున్నామన్నారు. అభిమానులకు వీనుల విందైన క్రికెట్ వినోదం అందించేందుకు తాము బీసీసీఐ, ఎమిరేట్స్, ఒమన్ క్రికెట్ బోర్డులతో కలిసి పనిచేస్తామని జెఫ్ అలార్డిస్ స్పష్టం చేశారు.
ప్రపంచకప్‌ను భారత్‌లో నిర్వహించడమే తమకు సంతోషకమని.... అయితే కరోనా పరిస్థితుల దృష్ట్యా యూఏఈకి తరలించక తప్పడం లేదని బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ తెలిపారు.