T20 World Cup: మొదటిసారి టీ20 వరల్డ్ కప్ ట్రోఫీని అందుకున్న ఆసిస్.. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా..

T20 World Cup: టీ 20 వరల్డ్ కప్‌లో టైటిల్‌ను ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది.

Update: 2021-11-15 01:15 GMT

T20 World Cup (tv5news.in)

T20 World Cup: టీ 20 వరల్డ్ కప్‌లో టైటిల్‌ను ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. తొలిసారి తన ఖాతాలో వేసుకుంది. ఐదు వన్డే వరల్డ్ కప్‌లు తమ ఖాతాలో ఉన్నా.. పొట్టి ఫార్మాట్‌ ట్రోఫీ లేని లోటును తీర్చుకుంది. నిన్న న్యూజిలాండ్‌తో ఏకపక్షంగా ముగిసిన ఫైనల్‌ పోరులో కంగారూలు 8 వికెట్ల తేడాతో గెలిచారు. మిచెల్‌ మార్ష్‌ 50 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 77 పరుగులతో నాటౌట్‌ గా నిలిచాడు.

అదరగొట్టే ఆటతీరుతో జట్టుకు సునాయాస విజయాన్ని అందించాడు. డేవిడ్‌ వార్నర్‌ 38 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 53 పరుగులు చేశాడు. మ్యాక్స్‌వెల్‌ సైతం 28 పరుగులతో నాటౌట్‌గా నిలచి గెలుపులో కీలకంగా నిలిచారు. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌ 20 ఓవర్లలో 4 వికెట్లకు 172 పరుగులు చేసింది. ఆ తర్వాత ఛేదనలో ఆసీస్‌ 18.5 ఓవర్లలో 2 వికెట్లకు 173 పరుగులు చేసి విజయం సాధించింది. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా మిచెల్‌ మార్ష్‌, ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నమెంట్‌గా వార్నర్‌ నిలిచారు.

భారీ ఛేదనలో ఆసీస్‌ 15 పరుగుల వద్దే వికెట్‌ కోల్పోయింది. అయినా సరే ఆ జట్టు ఏ దశలోనూ ఇబ్బందిపడలేదు. డేంజరస్‌ వార్నర్‌కు జతగా మిచెల్‌ మార్ష్‌ అండగా నిలవడంతో స్కోరు దూసుకెళ్లింది. నాలుగో ఓవర్‌లోనే మార్ష్‌ వరుసగా సిక్స్, పోర్లతో పరుగులకు నాందిపలికాడు. ఇక అప్పటిదాకా బంతికో పరుగు చొప్పున సాధించిన వార్నర్‌.. తొమ్మిదో ఓవర్‌లో విజృంభించి 17 పరుగులు రాబట్టాడు. అదే జోరుతో ఓ భారీ సిక్సర్‌తో 34 బంతుల్లో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

దీంతో 12 ఓవర్లలోనే స్కోరు వంద పరుగులు దాటింది. అంతా సవ్యంగానే సాగుతుందనుకున్న దశలో స్లాగ్‌ స్వీప్‌ షాట్‌ కోసం చూసిన వార్నర్‌ను బౌల్ట్‌ క్లీన్‌బౌల్డ్‌ చేయడంతో కివీస్‌ ఊపిరిపీల్చుకుంది. అయితే మార్ష్‌ ధాటిని కొనసాగిస్తూ లాంగాన్‌లో సిక్సర్‌తో 31 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తి చేశాడు. సరైన సమయంలో ఫామ్‌ అందుకున్న మ్యాక్స్‌వెల్‌ 16వ ఓవర్‌లో 4,6తో ఆసీస్‌ వేగంగా ఛేదన వైపు సాగింది. 19వ ఓవర్‌లో రెండు ఫోర్లతో ఆసీస్‌ ఎలాంటి ఇబ్బందీ లేకుండా మ్యాచ్‌ను ముగించి సంబరాలు చేసుకుంది.

Tags:    

Similar News