జాతీయ పతాక ఆవిష్కరణకు నేటితో వందేళ్లు ..!
భారతీయుల హృదయాలను సగర్వంతో తలెత్తుకునేలా చేసిన జాతీయ పతాకం ఆవిష్కరణ నేటికి వంద సంవత్సరాలు పూర్తిచేసుకుంది.;
భారతీయుల హృదయాలను సగర్వంతో తలెత్తుకునేలా చేసిన జాతీయ పతాకం ఆవిష్కరణ నేటికి వంద సంవత్సరాలు పూర్తిచేసుకుంది. దేశభక్తి ఉప్పొంగేలా జాతీయ పతాకాన్ని తెలుగు వెలుగు పింగళి వెంకయ్య రూపకల్పన చేశారు. 1921 మార్చి 31న బెజవాడ విక్టోరియా మహల్‌లో జరిగిన అఖిల భారత జాతీయ కాంగ్రెస్ కమిటీ సమావేశంలో ఈ పతాకాన్ని జాతిపిత మహాత్మాగాంధీకి వెంకయ్య అందజేశారు.
1906లో కోల్‌కతాలో ది గ్రాండ్ ఓల్డ్ మ్యాన్‌గా పిలిచే దాదాబాయి నౌరోజి అధ్యక్షతన 22వ అఖిల భారత కాంగ్రెస్ మహాసభలు జరిగాయి. అయితే సభ ప్రారంభానికి ముందు బ్రిటీష్ పతాకం యూనియన్ జాక్‌కు గౌరవ వందనం చేయాల్సి వచ్చింది. దీంతో కలత చెందిన పింగళి వెంకయ్య ప్రత్యేకంగా జాతీయ జెండా ఎందుకు ఉండకూడదనే విషయాన్ని సభలో ప్రస్తావించారు. అనంతరం జాతీయ జెండా ఆవశ్యకత వివరిస్తూ దేశవ్యాప్తంగా పర్యటించి 1916లో ఏ నేషనల్ ఫ్లాగ్ ఫర్ ఇండియాఅనే ఆంగ్ల పుస్తకం రచించారు.
1921 మార్చి 31న విజయవాడలోని విక్టోరియా బాపూ మ్యూజియం సమావేశ మందిరంలో మహాత్మాగాంధీ సమక్షంలో సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశంలోనే వెంకయ్యకు జాతీయ పతాక రూపకల్పన బాధ్యతలు అప్పగించారు. ఆయన మూడు గంటల వ్యవధిలోనే తన సహ అధ్యాపకుడు అయిన ఈరంకి వెంకటశాస్త్రి సహకారంతో జెండా నమూనా తయారుచేసి గాంధీకి అప్పగించారు. అయితే అందులో ఎరుపు, ఆకుపచ్చ రంగులతో పాటు రాట్నం చిహ్నం ఉన్నాయి. ఎరుపు రంగు హిందువులకు, ఆకుపచ్చ ముస్లింలకు, తెలుపు రంగు ఇతర మతాలకు ఉండేలా పతాకం తీర్చిదిద్దాలని గాంధీ సూచించారు. ఆయన సూచనలతో ఎరుపు, ఆకుపచ్చ, తెలుపు రంగుల మధ్యలో రాట్నం గుర్తుతో జాతీయ పతాకం తయారుచేశారు.
1931లో కరాచీలో జరిగిన కాంగ్రెస్ మహాసభల్లో సిక్కులు జెండాలోని రంగుల గురించి సమస్య లేవనెత్తారు. ఈ నేపథ్యంలోనే నెహ్రూ, మౌలానా అబుల్ కలాం అజాద్, భోగరాజు పట్టాభి సీతారామయ్య, తారాసింగ్, దత్తాత్రేయ బాలకృష్ణతో కూడిన కమిటీ పలు సూచనలు చేసింది. దీంతో కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులతో ఉన్న పతాకంపై రాట్నం ఉండేలా వెంకయ్య జెండాలో మార్పులు చేశారు. ఈ మార్పును కాంగ్రెస్ జాతీయ మహాసభ ఆమోదించింది.
జాతీయ జెండాకు, పార్టీ జెండాకు మధ్య వ్యత్యాసం ఉండాలనే ఆలోచనతో 1947 జులై 22న కాషాయం, తెలుపు, ముదురు ఆకుపచ్చ రంగుల మధ్యలో నీలిరంగులో అశోకుని ధర్మచక్రం ఉండేలా నిర్ణయం తీసుకొని మార్పులుచేశారు. ఇలా ప్రస్తుత మన జాతీయ జెండాకు రూపకల్పన జరిగింది.