అడిగారు కదా అని ష్యూరిటీ సంతకం పెట్టేముందు ఓసారి ఆలోచిస్తే మంచిది..
ఎవరైనా ఒకరితో గ్యారెంటర్‌గా సంతకం పెట్టించమని కోరతాయి. అలా మిమ్మల్ని ఎవరైనా సంతకం పెట్టమని కోరితే, పెట్టాలా, వద్దా..;
ఈ ప్రపంచంలో డబ్బు అవసరం లేనిదెవరికి. కొన్ని సందర్భాల్లో సడెన్‌గా డబ్బు అవసరం అవుతుంది. అప్పు తీసుకొని మరీ సర్ధుబాటు చేసుకోవాల్సిన పరిస్థితి. ఆస్పత్రిలో ఆపరేషన్ కోసమో, ఇంటి నిర్మాణం కోసమో, వ్యాపారం కోసమో ఇలా రకరకాల కారణాలుంటాయి. అలాంటప్పుడు రుణం ఇచ్చే బ్యాంకులు, ఇతర సంస్థలు... రుణం తీసుకునేవారితోపాటూ... ఎవరైనా ఒకరితో గ్యారెంటర్‌గా సంతకం పెట్టించమని కోరతాయి. అలా మిమ్మల్ని ఎవరైనా సంతకం పెట్టమని కోరితే, పెట్టాలా, వద్దా అన్న డౌట్ మీకు వస్తుంది. కుటుంబ సభ్యులే అడిగితే డౌట్ లేకుండా సంతకం పెడతారు. అదే మరి స్నేహితులో, బంధువులో అడిగితే కాస్త ఆలోచిస్తారు. కారణం అందుకు సంబంధించిన రూల్స్ పూర్తిగా తెలియకపోవడమే. అవేంటో ఓసారి తెలుసుకుందాం. అప్పుడు సంతకం పెట్టాలో లేదో నిర్ణయించుకోవచ్చు.
రెండు రకాల గ్యారెంటీలు : గ్యారెంటర్‌గా సంతకం పెట్టే అంశంలో రెండు రకాలున్నాయి. ఒకటి నాన్ ఫైనాన్షియల్ గ్యారెంటర్ మరొకటి ఫైనాన్షియల్ గ్యారెంటర్. నాన్ ఫైనాన్స్‌లో అప్పు తీసుకున్న వ్యక్తికీ, బ్యాంక్‌కూ మధ్య మీరు మధ్యవర్తిగా ఉంటారు. ఒకవేళ అప్పు తీసుకున్న వ్యక్తి కనపడకపోయినా, టచ్‌లో లేకపోయినా బ్యాంక్ మిమ్మల్ని కలుస్తుంది. మీరు ఆ వ్యక్తితో మాట్లాడి... బ్యాంకుకు కనెక్ట్ అయ్యేలా చెయ్యాలి. అంతే తప్ప మీరు డబ్బు చెల్లించాల్సిన పని ఉండదు. అదే ఫైనాన్షియల్ గ్యారెంటర్‌గా ఉంటే... అప్పు తీసుకున్న వ్యక్తి దాన్ని చెల్లించకపోతే మీరే మొత్తం అప్పు చెల్లించాల్సి ఉంటుంది.
వాళ్ల క్రెడిట్ స్కోర్ తెలుసుకోవాల్సిందే : ఓ వ్యక్తిని నమ్మి మీరు ఫైనాన్షియర్‌గా సంతకం పెడుతున్నప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా అప్పు తీసుకుంటున్న వ్యక్తి ఎవరైనాసరే... వాళ్ల క్రెడిట్ స్కోర్ ఎలా ఉందో చూడాలి. మంచి క్రెడిట్ స్కోర్ ఉంటే, వాళ్లు అప్పు తిరిగి చెల్లించగలరని అర్థం. అదే రెగ్యులర్‌గా అప్పులు చేస్తూ ఉంటే, వాళ్ల క్రెడిట్ స్కోర్ తగ్గిపోతుంది. అలాంటి వాళ్లు అప్పు చెల్లించలేరు. వాళ్ల తరపున సంతకం పెడితే... మీరు అప్పు చెల్లించాల్సి ఉంటుంది. ఆ విషయంలో జాగ్రత్త పడకపోతే భారం మీమీదే పడుతుంది.
మీకు చిక్కులు తప్పవు : అప్పు తీసుకున్నవాళ్లు ఒక్కోసారి అప్పు చెల్లించరు. ఆ సమయంలో మీరు కూడా బ్యాంకుకు అందుబాటులో లేరని అనుకుందాం. అప్పుడేమవుతుందంటే... అప్పుపై వడ్డీ పెరిగిపోతుంది. అదే సమయంలో మీ క్రెడిట్ స్కోర్ కూడా పడిపోతుంది. ఎందుకంటే మీరు అందుబాటులో లేరన్న కారణంగా... మీపైనా నెగెటివ్ మార్క్ పడుతుంది. కొన్నాళ్ల తర్వాత మీరు అందుబాటులోకి వస్తే, మీరు భారీ ఎత్తున (వడ్డీలపై వడ్డీలు) అప్పు చెల్లించాల్సి ఉంటుంది. ఆ సమయంలో మీకు అప్పు కావాలంటే పొందటం చాలా కష్టం.
ఎక్కువ కాలం లోన్లతో ప్రమాదం : ఏడాదో, రెండేళ్లలోనో సెటిల్ చేసేసే లోన్లతో పెద్దగా ఇబ్బంది ఉండదు కానీ... ఏ ఇళ్ల కోసమో లోన్ తీసుకుంటే మాత్రం అది వెంటనే చెల్లించరు. దాదాపు 10 నుంచీ 20 ఏళ్లు కూడా చెల్లించే అవకాశాలుంటాయి. అలాంటి అప్పులకు సంతకం పెడితే... అన్నేళ్లపాటూ మీకూ బాధ్యత ఉంటుంది. దురదృష్టం కొద్దీ మూడు, నాలుగేళ్ల తర్వాత వాళ్లు అప్పు చెల్లించలేకపోతే... ఇక ఆ భారం మొత్తం మీపైనే పడుతుంది.
సంబంధాలపై ప్రభావం : మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అన్నాడో పెద్దాయన. నిజమే డబ్బు చుట్టూ చాలా అంశాలు ముడిపడి ఉంటాయి. మంచితనం కొద్దీ మీరు సంతకం చేశాక... ఆ వ్యక్తి అప్పు చెల్లించకపోతే... మీకూ ఆ వ్యక్తికీ మధ్య సంబంధాలు దెబ్బతింటాయి. అసలు ఏ సంతకమూ పెట్టకుండా కుదరదని చెప్పేస్తే... అది పెద్దగా ప్రాబ్లం కాదు. మీ సంబంధాలు అంతగా దెబ్బతినవు. కానీ ఒకరికి ఒకరు సాయం చేసుకోవడం మానవ నైజం కదా. అందువల్ల సంతకం పెట్టడం సహజం. అవతలి వాళ్లు కూడా అంతే బాధ్యతగా అప్పు తీర్చాలి. అప్పుడే సంబంధాలు బెడిసికొట్టకుండా ఉంటాయి.