Aam Aadmi Party : మిషన్ గుజరాత్‌కు శ్రీకారం చుట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ..!
Aam Aadmi Party : పంజాబ్ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ .. ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు!;
Aam Aadmi Party : పంజాబ్ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ .. ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు! దేశవ్యాప్తంగా పార్టీని విస్తరించేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే తక్కువ కాలంలో రెండు రాష్ట్రాల్లో అధికారాన్ని చేజిక్కించుకున్న ఆప్...ఇప్పుడు గుజరాత్‌పైనా కన్నేసింది. మిషన్ గుజరాత్ పేరుతో... ఏకంగా ప్రధాని మోదీ సొంత రాష్ట్రంలో పోటీకి సిద్ధమవుతోంది.ఈ ఏడాది డిసెంబర్లో జరిగే ఎన్నికల్లో బీజేపీని గద్దెదించి.. అధికారాన్ని హస్తగతం చేసుకోవాలన్నది కేజ్రీవాల్ వ్యూహంగా కనిపిస్తోంది.ఇందులో భాగంగానే.... పంజాబ్ సీఎం భగవంత్‌మాన్‌తో కలిసి గుజరాత్‌లో పర్యటిస్తున్నారనేది రాజకీయవిశ్లేషకుల వాదన.
అహ్మబాద్‌లోని శబర్‌మతి ఆశ్రమాన్ని సందర్శించిన కేజ్రీ, మాన్‌లు.... మహాత్మా గాంధీ నివసించిన హృదయ్ కుంజ్‌ను, మ్యూజియంను పరిశీలించారు. జాతిపిత విగ్రహానికి నివాళులర్పించారు. గాంధీజీ ఉపయోగించిన చరఖాను తిప్పుతూ కొద్దిసేపు గడిపారు. అనంతరం... శబర్‌మతి ఆశ్రమాన్ని సందర్శించినప్పటి తమ అనుభూతిని అక్కడి విజిటర్స్ బుక్‌లో రాశారు. ఢిల్లీ సీఎం అయ్యాక శబర్‌మతి ఆశ్రమాన్ని దర్శించడం ఇది మొదటి సారన్న కేజ్రీవాల్...గతంలో సామాజిక కార్యకర్తగా ఉన్న సమయంలో చాలా సార్లు వచ్చినట్లు తెలిపారు. ఇక్కడకు వచ్చిన ప్రతిసారి మనసుకు ఎంతో శాంతి దొరుకుతుందన్నారు కేజ్రీవాల్.
అనంతరం... అహ్మదాబాద్ తూర్పు ప్రాంతంలో రెండు కిలోమీటర్ల వరకూ జరిగే రోడ్‌షోలో కేజ్రీవాల్, మాన్ కలిసి పాల్గొన్నారు. ఆదివారం..అహ్మదాబాద్‌లోని స్వామినారాయణ ఆలయ సందర్శిస్తున్నారు.మొత్తానికి మిషన్ గుజరాత్ కు శ్రీకారం చుట్టిన ఆమ్ ఆద్మీ..... తిరంగా యాత్రలు చేస్తోంది. గుజరాత్‌లోని అన్ని జిల్లాలు, గ్రామ పంచాయతీలు, తహసిల్స్ ను చుట్టివచ్చేలా ప్రణాళికలు చేస్తోంది.
2017 గుజరాత్ ఎన్నికల్లో ఆప్ అరంగేట్రం చేసినా.. ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. ప్రచార వైఫల్యం ఫలితంగా.. 29 మంది అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు. ఈ ఫలితాలను దృష్టిలో పెట్టుకుని.. ప్రణాళికలను రూపొందిస్తున్నారు. ఈ సారి మొత్తం 182 అసెంబ్లీ స్థానాల్లో ఆప్ పోటీ చేయనుంది ఏదేమైనా పంజాబీ ఎన్నికలలో గెలిచిన జోష్‌తో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ గుజరాత్‌పై ఫోకస్ చేయడం దేశ రాజకీయాలలో ఆసక్తికర పరిణామం.