Ayodhya Deepotsav 2021: ప్రపంచ రికార్డు కోసం అయోధ్య ప్రయత్నం.. దీపాల కాంతులతో..

Ayodhya Deepotsav 2021: దీపావళి సందర్భంగా అత్యధిక దీపాలు వెలిగించి రికార్డు నమోదు చేసేందుకు అయోధ్య నగరం సిద్ధమైంది.;

Update: 2021-11-03 05:48 GMT

Ayodhya Deepotsav 2021: దీపావళి సందర్భంగా అత్యధిక దీపాలు వెలిగించి ప్రపంచ రికార్డు నమోదు చేసేందుకు అయోధ్య నగరం సిద్ధమైంది. దీపావళి ముందురోజైన ఇవాళ సరయు నదీతీరంలోని రామ్‌కీ పైడి ఘాట్‌లో 9 లక్షల దీపాలు వెలిగించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. గతేడాది వెలిగించిన 6 లక్షల దీపాల రికార్డును అధిగమించబోతున్నట్లు ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం వెల్లడించింది. అత్యధిక దీపాలు వెలిగించి ప్రపంచ రికార్డు నమోదు చేయనున్నట్లు తెలిపింది.

రామ్‌కీ పైడి ఘాట్‌లో 9 లక్షల దీపాలతో పాటు, అయోధ్య పట్టణమంతటా దీపాలు వెలిగించే కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. అయోధ్యతోపాటు యావత్ ప్రపంచానికి మంచి జరగాలని కోరుకుంటూ ఈ ప్రయత్నం చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. గత కొన్ని రోజులుగా సరయు నదీతీరంలో అయోధ్య చరిత్రను తెలిపే లేజర్ షోలు నిర్వహిస్తున్నారు.

రామ మందిరంతోపాటు నగరంలోని ఇతర ప్రదేశాల ఇతివృత్తాలతో ఇవాళ మధ్యాహ్నం టేబులాక్స్‌తో కవాతు కూడా ప్లాన్ చేశారు. రంగురంగుల విద్యుత్‌ దీపాలు, త్రీడీ హోలోగ్రాఫిక్స్‌, లేజర్‌ షోలు, లక్షలాది ప్రమిదలతో. అయోధ్య దగదగలాడుతోంది.మరోవైపు.. రామ మందిరం నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. గత ఏడాది ఆగస్టు 5న ప్రధాని మోదీ అయోధ్య రామ మందిరానికి భూమి పూజ చేసి ప్రారంభించారు.

రామజన్మభూమి తీర్థ్‌ క్షేత్ర ట్రస్టు మందిరానికి సంబంధించిన అన్ని బాధ్యతలను నిర్వహిస్తోంది. ఇప్పటికే ఆలయ నిర్మాణానికి సంబంధించిన ఫేజ్‌-1 పనులు పూర్తవ్వగా.. ఫేజ్‌-2 పనులు సైతం ముగియనున్నట్లు తీర్థ క్షేత్ర ట్రస్టు వెల్లడించింది.

డిసెంబర్‌ 2023 నుంచి భక్తులకు దర్శనానికి అనుమతిస్తారు.అదే ఏడాది ఆలయంలో శ్రీరాముని మూలవిరాట్టు ప్రతిష్ఠాపన చేయాలని భావిస్తున్నట్లు పేర్కొంది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన టెంపుల్‌ ఆర్కిటెక్ట్స్‌ 'సోమ్‌పురా ఫ్యామిలీ' అయోధ్య రామ మందిర నిర్మాణ బాధ్యతలను స్వీకరించింది.

Tags:    

Similar News