హింసాత్మకంగా బెంగాల్ నాలుగో విడత పోలింగ్
పశ్చిమబెంగాల్‌లో నాలుగో విడత ఎన్నికల పోలింగ్‌లో హింసాత్మక వాతావరణం నెలకొంది.;
పశ్చిమబెంగాల్‌లో నాలుగో విడత ఎన్నికల పోలింగ్‌లో హింసాత్మక వాతావరణం నెలకొంది. కూచ్‌బెహర్ జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శీతల్‌కూచి నియోజకవర్గ పరిధిలో టీఎంసీ, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తింది. ఇరు వర్గాలు పరస్పర దాడులకు దిగారు.
అప్రమత్తమైన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. అటు హుగ్లీలో బీజేపీ అభ్యర్థి లాకెట్ ఛటర్జీ కారును స్థానికులు ధ్వంసం చేశారు. దీంతో మరిన్ని బలగాలను పంపించాలని ఎన్నికల అధికారులను లాకెట్ ఛటర్టీ కోరారు. ఈ దాడిలో మీడియా వాహనాలను కూడా ధ్వంసం చేశారు.
మరోవైపు బెంగాల్‌లో నాలుగో దశ పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్‌లో పాల్గొంటున్నారు. ఓటు వేయడానికి క్యూలైన్లలో వేచి ఉన్నారు. ఉదయం 11 గంటల వరకు 16.65 శాతం పోలింగ్ నమోదైనట్ల ఎన్నికల అధికారులు తెలిపారు.
కూచ్ బెహార్‌లోని నటాబరి నియోజకవర్గానికి చెందిన టీఎంసీ అభ్యర్థి రవీంద్ర నాథ్ ఘోష్ ఓ పోలింగ్ కేంద్రానికి వినూత్నంగా వచ్చారు. ఆయన హెల్మెట్ ధరించి కనిపించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండటానికి తాను హెల్మెట్ ధరించినట్లు తెలిపారు.
హింసాత్మకంగా బెంగాల్ నాలుగో విడత పోలింగ్మొత్తం 44 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటల ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6:30 గంటల వరకు కొనసాగుతుంది. 15వేల 940 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు.
ఈ విడత పోలింగ్‌లో కోటీ 15 లక్షల మంది ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. ఈ క్రమంలోనే పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.