Inspiring Story: కమల్ కిషోర్ మండల్ సక్సెస్ స్టోరీ.. ఫ్యూన్‌గా పనిచేసిన యూనివర్శిటీలోనే అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా..
Inspiring Story: అందరి జీవితాలు ఒకేలా ఉండవు. అవకాశాలను వెతుక్కునే వారు కొందరైతే, వచ్చిన అవకాశాన్ని వినియోగించుకునేవారు మరికొందరు.;
Inspiring Story: అందరి జీవితాలు ఒకేలా ఉండవు. అవకాశాలను వెతుక్కునే వారు కొందరైతే, వచ్చిన అవకాశాన్ని వినియోగించుకునేవారు మరికొందరు. యూనివర్శిటీలో ఫ్యూనుగా ఉద్యోగం చేస్తున్న వ్యక్తి కళాశాలకు వస్తున్న విద్యార్ధులను చూసి తాను చదువుకోవాలని ఆశ పడ్డాడు. అందుకోసం నిరంతరం కృషి చేశాడు. చదువుతో పాటు ఉద్యోగమూ వచ్చింది. ఇప్పుడు అదే యూనివర్శిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా జాయిన్ అయ్యాడు బీహార్ భాగల్పూర్‌కు చెందిన కమల్ కిషోర్ మండల్.
దృఢ సంకల్పం, పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదని, బీహార్‌లోని భాగల్‌పూర్ జిల్లాకు చెందిన 42 ఏళ్ల వ్యక్తి నిరూపించాడు. భాగల్పూర్ పట్టణంలోని ముండిచక్ నివాసి కమల్ కిషోర్ మండల్ ఒకప్పుడు ప్యూన్‌గా పనిచేసిన తిల్కా మాంఝీ భాగల్పూర్ విశ్వవిద్యాలయంలో (TMBU) అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా బాధ్యతలు స్వీకరించాడు.
అతడు ఈస్థాయికి చేరుకోవడానికి ఎన్నో కష్టాలు.. మరెన్నో ఒడిదుడుకులు. అన్నింటినీ అధిగమించి తనలాంటి వారెందరికో ఆదర్శంగా నిలుస్తున్నాడు. మొదట్లో నైట్ గార్డ్‌గా పని చేసి అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఎదిగిన అతని ప్రయాణం నిజంగా స్ఫూర్తిదాయకం.
23 సంవత్సరాల వయస్సులో, మండల్ 2003లో ముంగేర్‌లోని RD & JD కళాశాలలో నైట్ గార్డ్ ఉద్యోగాన్ని చేపట్టాడు. ఆర్థిక సమస్యల కారణంగా పొలిటికల్ సైన్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినప్పటికీ కుటుంబ పోషణ నిమిత్తం నైట్ గార్డ్ ఉద్యోగం చేయవలసి వచ్చేది.
నైట్ గార్డ్‌గా చేరిన నెల తర్వాత, అతను అంబేద్కర్ థాట్ అండ్ సోషల్ వర్క్ (పోస్ట్ గ్రాడ్యుయేట్) విభాగానికి డిప్యుటేషన్‌పై పంపించబడ్డాడు. తరువాత అతని పోస్ట్ 2008లో ప్యూన్‌గా మార్చబడింది. యూనివర్శిటీలో తరగతులకు హాజరవుతున్న విద్యార్థులను చూసి తనకు కూడా పై చదువులు చదువుకోవాలనే ఆశ కలిగింది.
"నేను డిపార్ట్‌మెంట్ అధికారులను అభ్యర్ధించాను. పై చదువుకు నాకు అనుమతి ఇవ్వమని. నా ఆసక్తిని గమనించి వారు కూడా తమ ప్రోత్సాహాన్ని అందించారు. దాంతో నేను తిరిగి చదువు ప్రారంభించాను. 2009లో ఎంఏ (అంబేద్కర్ థాట్ అండ్ సోషల్ వర్క్‌లో) చేశాను" అని కిషోర్ మండల్ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.
MA పూర్తి చేసిన తర్వాత, మండల్ మళ్లీ 2009లో PhD చేయడానికి యూనివర్శిటీ అధికారుల అనుమతి కోరాడు. 2019లో PhD పట్టా పొందాడు. ఆ సమయంలో, అతను లెక్చరర్ మరియు జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (JRF) అవార్డుకు అర్హతను సంపాదించడానికి నిర్వహించిన నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (NET)ని కూడా విజయవంతంగా క్లియర్ చేశాడు.
2020లో, బీహార్ స్టేట్ యూనివర్శిటీ సర్వీస్ కమిషన్ (BSUSC) TMBU యొక్క అంబేద్కర్ థాట్ అండ్ సోషల్ వర్క్ విభాగంలో నలుగురు అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. 12 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూ కోసం షార్ట్‌లిస్ట్ చేయబడ్డారు. ఫలితాలు ప్రకటించినప్పుడు, ఎంపికైన నలుగురు అభ్యర్థులలో మండల్ కూడా ఉన్నారు.
మండల్ తండ్రి గోపాల్ తన కుటుంబాన్ని పోషించుకునేందుకు రోడ్డు పక్కన చిన్న టీ దుకాణం నడుపుతుంటాడు. "నా చదువుకు పేదరికం, కుటుంబ సమస్యలు అడ్డుగా నిలిచాయని నేను ఎప్పుడూ భావించలేదు. నేను ఉదయం తరగతులకు, మధ్యాహ్నం డ్యూటీకి హాజరయ్యే వాడిని. రాత్రిళ్లు చదువుకునేవాడిని అని చెబుతూ.. తన విజయానికి కారణమైన డిపార్ట్‌మెంట్ అధికారులు మరియు ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపారు.