విప్లవ రచయితల సంఘం నేత వరవర రావుకు బాంబే హైకోర్టులో ఊరట లభించింది. ఆయనకు ఆస్పత్రిలో చికిత్స అందించేందుకు అనుమతులు ఇచ్చింది. ఆయన కుటుంబ సభ్యుల అభ్యర్ధన మేరకు ఆయనకు నానావతి ఆస్పత్రిలో 15 రోజులపాటు చికిత్స పొందేందుకు అవకాశం ఇచ్చింది. భీమా కోరేగావ్ కేసులో అరెస్టయి.. ముంబయి జైలులో ఉన్న విరసం నేత వరవరరావును చికిత్సకు బాంబే హైకోర్టు అనుమతి ఇచ్చింది. 81 ఏళ్ల వరవరరావు ఆరోగ్యం మరింత క్షీణించిందంటూ ఆయన కుటుంబ సభ్యులు అభ్యర్ధన మేరకు చికిత్సకు అనుమతి ఇచ్చింది. వెంటనే ఆయనను నానావతి ఆస్పత్రికి తరలించి చికిత్స అందించాలని ఆదేశించింది.
వరవర రావుకు అందించే వైద్యఖర్చులను ప్రభుత్వమే భరించాలని కోర్టు స్పష్టంచేసింది. చికిత్స సందర్భంగా ఆస్పత్రి నిబంధనల ప్రకారం వరవరరావును ఆయన కుటుంబ సభ్యులు కలుసుకునే అవకాశం ఉంది. కేసు విచారణ సందర్భంగా జైలులో ఉన్న వరవరరావు ఆరోగ్యంపై బాంబే హైకోర్టుకు మహారాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది. వరవరరావు ఆరోగ్యం బాగుందని, మానసికంగా.. పూర్తి స్పృహలో ఉన్నారని తెలిపింది. వరవరరావుకు న్యూరలాజికల్ సమస్య, మూత్రనాళ ఇన్ఫెక్షన్‌లకు సంబంధించిన సమస్యులున్నాయని ఆయన తరుపు న్యాయవాది ఇందిరా జైసింగ్ కోర్టుకు తెలిపారు. దీంతో, అన్ని వైద్య పరీక్షలను నిర్వహించి, సమగ్ర వైద్య నివేదికను అందించాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.
భీమా కోరేగావ్ కేసులో అరెస్టై వరవరరావు విచారణ ఖైదీగా ఉన్నారు. మహారాష్ట్రలోని పుణె సమీపంలో బీమా కోరేగాం హింసలో మావోయిస్టుల ప్రమేయం ఉందని.. ఆ కేసు దర్యాప్తులో ప్రధాని నరేంద్రమోదీ హత్యకు మావోయిస్టులు కుట్ర పన్నారనే విషయం వెలుగు చూసిందని మహారాష్ట్ర పోలీసులు ఆరోపించారు. ఇందులో వరవరరావు సహా 9 మంది ఉద్యమకారుల ప్రమేయం ఉందంటూ మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు.