సోషల్ మీడియా నియంత్రణ కోసం కేంద్రం కొత్త నిబంధనలు..
ఓటీటీ, సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలను నియంత్రించేందుకు మూడు అంచెల విధానాన్ని రూపొందించింది.;
సోషల్ మీడియాలో.. చట్టవిరుద్ధమైన, తప్పుడు సమాచారాన్ని నియంత్రించేందుకు కేంద్రం ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. ఇందుకోసం కొత్త నియమావళిని రూపొందించింది. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు సమాచారానికి కారణమయ్యే వ్యక్తి వివరాలు కేంద్రానికి వెల్లడించడం, ఫిర్యాదులను సాధ్యమైనంత తొందరగా పరిష్కారించేలా నిబంధలను తీసుకొచ్చింది. ఓటీటీ, సామాజిక మాధ్యమాల్లో వచ్చే కంటెంట్‌ను సునిశితంగా పరిశీలిస్తున్నామని, తాజాగా వాటికి సంబంధించి నూతన మార్గదర్శకాలను విడుదల చేశామని కేంద్రమంత్రులు రవిశంకర్ ప్రసాద్, జవడేకర్‌లు సంయుక్త ప్రకటన చేశారు.
ఈ కొత్త మార్గదర్శకాల ప్రకారం, సామాజిక మాధ్యమ సంస్థలు తప్పనిసరిగా ఫిర్యాదు స్వీకరణ వ్యవస్థను రూపొందించుకోవాలి. ఇందులో ఫిర్యాదుల పరిష్కార ముఖ్య అధికారి, మరో నోడల్ అధికారిని నియమించుకోవాల్సి ఉంటుంది. యూజర్లు చేసే ఫిర్యాదులను 24గంటలపాటు స్వీకరించే వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలి. పరిష్కార అధికారిగా నియమితమైన వారు భారత్‌లో నివసించే విధంగా చర్యలు తీసుకోవాలి. మహిళలకు సంబంధించి అసభ్యకరమైన, మార్పిడి చేసిన ఫోటోలపై వచ్చే ఫిర్యాదులను 24గంటల్లోగా పరిష్కరించాలని తాజా మార్గదర్శకాల్లో కేంద్రం స్పష్టంచేసింది.
సోషల్ మీడియా దుర్వినియోగం, విద్వేష ప్రసంగాలను నివారించేందుకు మార్గదర్శకాలు రూపొందించాలని సుప్రీంకోర్టు చేసిన సూచన మేరకు ఈ నిబంధనలు రూపొందించామని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు. వీటిపై విస్తృత సంప్రదింపులు జరిపిన అనంతరం తాజా మార్గదర్శకాలను తీసుకొచ్చినట్లు వెల్లడించారు. అయితే, సామాజిక మాధ్యమ సంస్థలు భారత్‌లో వాణిజ్యం చేసుకునేందుకు తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ స్వాగతం పలుకుతుందని రవిశంకర్ ప్రసాద్ స్పష్టంచేశారు.
సోషల్ మీడియాపై నియంత్రణ ఉండాలనే విషయంపై భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ మధ్యే విద్వేష ప్రసంగాలు, తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేశారంటూ వెయ్యికి పైగా ఖాతాలను తొలగించాలని భారత ప్రభుత్వం ట్విటర్‌ను ఆదేశించింది. ప్రభుత్వ నిర్ణయంపై తొలుత వెనక్కి తగ్గని ట్విటర్, చివరకు ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపింది. ఈ నేపథ్యంలో సామాజిక మాధ్యమాలపై కేంద్రం నూతన మార్గదర్శకాలను తీసుకొచ్చింది.