దేశంలో చాపకింద నీరులా మరోసారి విజృంభిస్తోన్న కరోనా రక్కసి
దేశంలో కేసుల సంఖ్య 1 కోటి, 14లక్షల, 74వేలకు చేరుకున్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.;
భారత్‌లో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతోంది.కొత్తకేసుల సంఖ్య పెరుగుతోంది. నిన్నమొన్నటివరకు దేశంలో 15, 16వేల కేసులు మాత్రమే నమోదుకాగా.. పాజిటివ్ కేసులు సంఖ్య 35వేలు దాటింది. ఈ లెక్కన దేశంలో కేసుల సంఖ్య 1 కోటి, 14లక్షల, 74వేలకు చేరుకున్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ఇక తెలంగాణాలో కరోనా రక్కసి చాపకింద నీరులా మరోసారి విస్తరిస్తోంది. మరీ ముఖ్యంగా పాఠశాలలు, హాస్టల్స్‌లల్లో పిల్లలు వైరస్ బారిన పడుతున్నారు. నిర్లక్ష్యం వహించడంతో మళ్లీ కరోనా విజృంభిస్తున్నట్లు తెలిపారు. రాజేంద్రనగర్ ప్రభుత్వ ఎస్టీ హాస్టల్‌లో కరోనా కలకలం రేపింది.. ఏకంగా 22 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా తేలడం ఆందోళన కలిగిస్తోంది. విద్యార్థులకు కరోనా సోకిన విషయం తెలియడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు రాజేంద్రనగర్ లోని ప్రభుత్వ పాఠశాలలోనూ ఇద్దరికి కరోనా నిర్ధారణ అయింది.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఇప్పుడు రెండో సారి కరోనా వ్యాపిస్తుండటంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. జిల్లాలో గత వారం రోజుల నుంచి దాదాపు 20 కేసులు పైనే నమోదవుతున్నాయి. దీంతో వ్యాధిగ్రస్తులు, 60 ఏళ్లు పైబడిన వృద్ధులు కరోనా బారిన పడకుండా టీకా వేయించుకునేందుకు క్యూ కడుతున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనూ కరోనా కలకలం రేపుతోంది. దీంతో జిల్లావాసులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా స్కూళ్లలో కరోనా కేసులు రావడంతో అధికారులకు టెన్షన్ పట్టుకుంది. మంచిర్యాల జిల్లాలో ఓ స్కూలు, కాలేజీలో కరోనా కేసులు నమోదయ్యాయి. అటు బైంసాలోని కస్తూర్బా పాఠశాలలోనూ కరోనా కేసులు నమోదయ్యాయి
తెలంగాణాతోపాటు దేశంలోని పలు రాష్ట్రల్లో వైరస్ వ్యాప్తి ప్రమాదకర స్థాయిలో ఉంది. మహారాష్ట్రతోపాటు మరికొన్ని రాష్ట్రాల్లో కొత్తకేసులు ఆందోళన కల్గిస్తున్నాయి. దీని కారణంగా మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో లాక్ డౌన్ విధించగా... గత రాత్రి పలుప్రాంతాల్లో కర్ఫ్యూ వంటివి తీసుకొచ్చారు.
గుజరాత్‌లో గత కొద్దికాలంగా రోజువారీ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. దాదాపు మూడు నెలల తర్వాత ఈ రాష్ట్రంలో రోజువారీ కేసుల సంఖ్య మళ్లీ వెయ్యి దాటింది. ముఖ్యంగా వైరస్ ఉద్ధృతి ఎక్కువగా ఉన్న అహ్మదాబాద్‌లో పార్కులు మూసివేశారు. అహ్మదాబాద్ మున్సిపల్ ట్రాన్స్‌పోర్ట్ సర్వీస్, బస్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ సేవలు నిలిపివేయడంతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి.
కర్ణాటకలోనూ కరోనా ఉద్ధృతి ఎక్కవగానే ఉంది. ఉడుపిలోని ప్రముఖ మణిపాల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో గత రెండు రోజుల్లో 52 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఈ క్యాంపస్‌ను అధికారులు కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు. క్యాంపస్‌లోని మిగతా విద్యార్థులకు కూడా కరోనా పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.
కోవిడ్ వైరస్ సీజనల్ వ్యాధిగా మారే అవకాశం ఉందిన ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. నిబంధనలకువిరుద్దంగా సడలింపులు ఇవ్వొద్దని ప్రపంచ దేశాలకు సూచించింది. కరోనా వ్యాప్తిపై వాతావరణ మార్పులు, గాలి నాణ్యత ప్రభావాలపై ఐరాస నిపుణుల బృందం అధ్యయనం చేసింది. దాని ఆధారంగానే ఐరాస ఈ హెచ్చరిక జారీ చేసింది.
శ్వాసకోశ వైరల్ ఇన్ఫెక్షన్లు తరచూ సీజనల్‌గా మారతాయని ఈ నిపుణుల బృందం వెల్లడించింది. శీతాకాలంలో ఇన్‌ఫ్లూయెంజా విజృంభణ ఉంటుందని, సమశీతోష్ణ వాతావరణ పరిస్థితుల్లో జలుబు కలిగించే కరోనా వైరస్ వ్యాప్తి ఉంటుందని వెల్లడించింది. ఈ తీరు కొన్ని సంవత్సరాల పాటు కొనసాగితే, కొవిడ్-19 సీజనల్ వ్యాధిగా అభివృద్ధి చెందే అవకాశం ఉందని పేర్కొంది.