దారుణం.. ఓ ప్రైవేట్ ఆస్పత్రి సిబ్బంది నిర్వాకం..
వైద్యులు దేవుళ్లంటారు.. వీళ్లేంటి అతడి పాలిట యముళ్లలా ప్రవర్తించారు..;
అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన అతడిని నానా చిత్రహింసలు పెట్టి అతడి చావుకు కారణమయ్యారు.. గుజరాత్ లోని రాజ్ కోట్ సివిల్ హాస్పిటల్ లో ఆసుపత్రి సిబ్బంది ఆ రోగిని కిందపడేసి కాలితో తన్నడం, అతడి మీద కూర్చుని చిత్రవధకు గురి చేయడం చూస్తుంటే సినిమాల్లో విలన్ క్యారెక్టర్లు గుర్తుకొస్తున్నారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో కనిపించిన 38 ఏళ్ల ప్రభాకర్ పాటిల్ కొద్ది రోజుల క్రితం కోవిడ్ వైరస్ బారిన పడ్డాడు. అంతకు ముందే అతడికి మూత్రపిండాల సమస్యతో బాధపడుతుండగా 12 రోజుల క్రితం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కిడ్నీలో నీరు ఉందని చెప్పి ఆపరేషన్ చేసినీటిని బయటకు తీసివేశారు వైద్యులు. అనంతరం అతడు ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడటం ప్రారంభించాడు. కోవిడ్ టెస్ట్ చేస్తే పాజిటివ్ అని వచ్చింది. దాంతో కోవిడ్ చికిత్స కోసం సెప్టెంబర్ 8 న రాజ్‌కోట్ సివిల్ ఆసుపత్రిలో చేరారు.
సెప్టెంబర్ 12 న ఆసుపత్రిలో తన సోదరుడు మరణించాడని, అంతకు ముందే అతన్ని సిబ్బంది దారుణంగా కొట్టారని ప్రభాకర్ సోదరుడు విలాస్ పాటిల్ తెలిపారు. కోవిడ్ కారణంగా రోగి మరణించినప్పటికీ, ఆసుపత్రి అతని మృతదేహాన్ని సోదరుడికి అప్పగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రోటోకాల్ ప్రకారం మృతదేహాన్ని దహనం చేయలేదని కూడా ఆరోపించారు.
ఆసుపత్రి అధికారులు మాత్రం రోగి "మానసికంగా బాధపడుతున్నాడని" వైద్యానికి సహకరించ లేదని తెలిపారు. వార్డులో ఉన్న ఇతర పేషెంట్లకు ఇబ్బంది కలుగజేస్తున్నందున అతడిని అడ్డుకుంటున్నారని పేర్కొన్నారు. పిపిఇ కిట్‌లో ఉన్న ఆసుపత్రి సిబ్బంది ఒకరు రోగిపై కూర్చుని ఉండగా, మరొకరు చెంపదెబ్బ కొట్టి కామ్ గా ఉండమంటున్నారు. ఆపై భద్రతా సిబ్బంది రోగిని కాలితో తన్నడం కూడా కనిపిస్తుంది. ప్రభాకర్ మరణానికి ఆసుపత్రి సిబ్బంది అమానవీయ ప్రవర్తనే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అతడు నగరంలోని ఒక కర్మాగారంలో ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. మానసికంగా ఆరోగ్యంగానే ఉన్నాడు. ఆసుపత్రి సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని అతని కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.