మావోయిస్టులు తమ చెరలో ఉన్న కమాండోను విడిచిపెడతారా..?
కమాండో రాకేశ్వర్ సింగ్ ఆరోగ్యంగానే ఉన్నారా.. అనే వివరాలేమీ తెలియకపోవడంతో కుటంబ సభ్యుల్లో టెన్షన్ పెరిగిపోతోంది.;
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ అటవీప్రాంతంలో కూంబింగ్ కొనసాగుతోంది. మావోయిస్టుల చెరలో ఉన్న కమాండోని క్షేమంగా బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతానికి సమీప గ్రామాల్లోని వాళ్ల నుంచి వివరాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఓపక్క ఇన్‌ఫార్మర్లనూ రంగంలో దించారు. కమాండో రాకేశ్వర్ సింగ్ ఆరోగ్యంగానే ఉన్నారా.. ఆయనకు ఏమైనా గాయాలయ్యాయా.. అనే వివరాలేమీ తెలియకపోవడంతో కుటంబ సభ్యుల్లో టెన్షన్ పెరిగిపోతోంది.
అటు.. ఈ ఎన్‌కౌంటర్ ఘటనపై మావోయిస్టులు ఓ లేఖ విడుదల చేశారు. అందులో కమాండో ప్రస్తావన కూడా ఉంది. ప్రభుత్వం మధ్యవర్తుల పేర్లను ప్రకటిస్తే తమ వద్ద బంధీగా కోబ్రా కమాండర్ రాకేశ్వర్ సింగ్‌ను అప్పగిస్తామని దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్ప్ పేరిట వెలువడిన లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వం మధ్యవర్తుల పేర్లు ప్రకటిస్తే బందీని అప్పగిస్తామని వెల్లడించారు. అప్పటివరకు రాకేశ్వర్ సింగ్ తమ వద్దే క్షేమంగా ఉంటాడని పేర్కొన్నారు. పోలీసులు తమకు శత్రువులు కాదని.. ఎన్‌కౌంటర్‌లో మరణించిన వారి కుటుంబాలకు సంతాపం తెలుపుతున్నామన్నారు.
మొన్నటి ఎదురు కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు లేఖలో పేర్కొన్నారు. ఐజీ సుందర్‌రాజ్ నాయకత్వంలో 2వేల మంది పోలీస్ బలగాలు ఏప్రిల్ 3న దాడి కోసం వచ్చాయని తెలిపారు. రాయపూర్ కేంద్రంగా పనిచేస్తున్న విజయ్‌కుమార్ నాయకత్వంలో అక్టోబరులో 5 రాష్ట్రాల పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించారన్నారు.
కేంద్రమంత్రి అమిత్‌షా నేతృత్వంలో 2020 ఆగస్టులో ఢిల్లీలో జరిగిన సమావేశంలో 'ఆపరేషన్ ప్రహార్- ఆపరేషన్ సమాధాన్' ప్రణాళిక రూపొందించారని... ఈ ప్రణాళిక అమల్లో భాగంగా 150మందికి పైగా గ్రామీణ ప్రజల్ని భద్రతా బలగాలు చంపాయని ఆరోపించారు. వీరిలో మావోయిస్టు పార్టీ కార్యకర్తలు, నాయకులతో పాటు కొందరు ప్రజలు ఉన్నారన్నారు. వేలాదిమందిని జైళ్లలో పెట్టారని, మహిళలను హింసించి హత్యచేశారని ఆరోపించారు. ఓవైపు ఊచకోతను చేస్తూనే మరోవైపు పోలీస్ శిబిరాలను నిర్మించి రోడ్లు వేస్తూ.. ఇది ప్రజల అభివృద్ధి కోసమని తప్పుగా ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఫాసిస్టు 'సమాధాన్- ప్రహార్'కు PLGA ప్రతీకారం తీర్చుకుందని వీటన్నింటికీ మోదీ, అమిత్‌షా బాధ్యత వహించాలని లేఖలో పేర్కొన్నారు.
మావోయిస్టుల చెరలో ఉన్న కోబ్రా కమాండో రాకేశ్వర్ సింగ్ మన్హాస్ ఆచూకీ కోసం భద్రతా బలగాలు అన్ని మార్గాలపైనా దృష్టి సారించాయి. అటు, ఆ కుటుంబ సభ్యులు తీవ్రమైన ఆందోళనలో ఉన్నారు. నాన్నను వదిలేయండి అంటూ ఆ కమాండో కూతురు అడుగుతున్న తీరు కంటతడి పెట్టిస్తుంది.