దీదీ హస్తిన టూర్ సక్సెస్..2024లో ఆదే టార్గెట్.. !

Mamata Banerjee: 2024లో బీజేపీకి గట్టిపోటీ ఇవ్వాలనే లక్ష్యంతో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ముందుకెళ్తున్నారు.

Update: 2021-07-31 02:14 GMT

Mamata Banerjee file photo

Mamata Banerjee: 2024లో బీజేపీకి గట్టిపోటీ ఇవ్వాలనే లక్ష్యంతో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ముందుకెళ్తున్నారు. ఈ క్రమంలో ఆమె ఢిల్లీలో కీలక నేతలతో చర్చలు జరిపారు. ఈ నెల 26న ఢిల్లీ చేరుకున్న దీదీ. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, డీఎంకే పార్టీ నేత కనిమొళితో సమావేశమయ్యారు. ఆమె ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్‌ యాదవ్‌తోనూ భేటీ అవుతారని అంతా భావించారు. కానీ, అలాంటిదేమీ లేకుండా మమత శుక్రవారం బెంగాల్‌కు వెళ్లిపోయారు.

అటు పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనేందుకు ఢిల్లీకి వచ్చిన పవార్ సైతం... మహారాష్ట్రకు చేరుకున్నారు. ఇరువర్గాలవైపు నుంచి ఎలాంటి చొరవ లేకపోవడంతో వీరి మధ్య సమావేశం జరగలేదంటున్నాయి సన్నిహిత వర్గాలు. అయితే ఇటీవలే తృణమూల్ నేత యశ్వంత్ సిన్హాతో పవార్ సమావేశమయ్యారని, దీనిపై అనవసర ఊహాగానాలు అవసరం లేదంటున్నారు.

అయితే దీదీ, పవార్ మధ్య సమావేశం జరకపోవడానికి రెండు కారణాలు చెబుతున్నారు రాజకీయ నిపుణులు. విపక్షాల కూటమికి నాయకత్వం వహించేందుకు ఇద్దరూ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఒకరి నుంచి వచ్చే స్పందన కోసం ఇంకొకరు ఎదురుచూస్తున్నట్లు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే ఇటీవల ప్రధాని మోదీ, పవార్ మధ్య భేటీ కూడా చర్చనీయాంశమైంది. ఈ సమావేశం కూడా దీదీ-పవార్ కలుసుకోకపోవడానికి కారణంగా చెబుతున్నారు.

మరోవైపు తన ఢిల్లీ పర్యటన విజయవంతమైనట్లు తెలిపారు మమతాబెనర్జీ. ప్రతి రెండు నెలలకొకసారి ఢిల్లీలో పర్యటిస్తానన్నారు. ఆమె పవార్‌తో మాట్లాడినట్లు కూడా తెలిపారు. తామంతా రాజకీయ ప్రయోజనాల కోసమే కలినట్లు తెలిపారు. 'ప్రజాస్వామ్య రక్షణ.. దేశ రక్షణ' అనే నినాదంతో ముందుకెళ్తున్నామన్నారు. 

Tags:    

Similar News