ఈనెల 6న దేశవ్యాప్తంగా రహదారుల దిగ్భందానికి రైతు సంఘాల పిలుపు

రైతులతో చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని లోక్‌సభలో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ ప్రకటించారు.

Update: 2021-02-02 16:29 GMT

నూతన వ్యవసాయ చట్టాలు రద్దు చేసేవరకు.. ఉద్యమాన్ని ఆపే ప్రసక్తే లేదని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ తికాయత్ స్పష్టం చేశారు. ఈనెల 6న దేశవ్యాప్త రహదారుల దిగ్భందానికి పిలుపునిచ్చారు. తమ నిరసనలు అక్టోబర్ వరకు ఆపబోమని తికాయత్ హెచ్చరించారు. చట్టాలను వెనక్కి తీసుకునేంత వరకు ఇళ్లకు వెళ్లబోమని.. ఆయన తేల్చిచెప్పారు. చట్టవిరుద్ధంగా పోలీసు కస్టడీలోకి తీసుకున్న రైతులను విడుదల చేసేంత వరకు ప్రభుత్వంతో చర్చలు జరపేది లేదని రాకేశ్ తికాయత్ అన్నారు.

మరోవైపు రైతులతో చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కేంద్రప్రభుత్వం లోక్‌సభలో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ ప్రకటించారు. రైతుల సమస్యలను చర్చించేందుకు కేంద్రం పార్లమెంటు బయట, లోపల ఎప్పుడైనా సిద్ధంగా ఉంటుందన్నారు.

మరోవైపు ఈనెల 6న మధ్యాహ్నం 12 గంటల నుంచి 3గంటల వరకు దేశవ్యాప్తంగా రోడ్లను దిగ్భందించనున్నట్లు రైతు సంఘాల నేతలు ప్రకటించడంతో.. పోలీసులు భారీ భద్రతా చర్యలు చేపట్టారు. రైతు ఉద్యమకారులను నిలువరించేందుకు ఢిల్లీ సరిహద్దులో మేకులు, పెద్ద ఇనుప బారికేడ్లను ఏర్పాటు చేశారు. రహదారి మధ్యలో కాంక్రీట్​పోతపోసి అందులో పదునైన ఇనుప మేకులను అమర్చారు. రిపబ్లిక్ డే రోజున ఢిల్లీలో రైతుల ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో.. ఢిల్లీ పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకున్నట్టు తెలుస్తోంది.



Tags:    

Similar News