Karnataka Medical College: ఫ్రెషర్స్ పార్టీ చేసుకున్నారు.. కరోనా బారిన పడ్డారు..

Karnataka Medical College: కరోనా వ్యాప్తి ఇంకా కొనసాగుతూనే ఉంది. కర్ణాటకలో జరిగిన ఓ ఘటన అందరిని అలర్ట్ అయ్యేలా చేస్తోంది

Update: 2021-11-26 11:00 GMT

Karnataka Medical College: కరోనా వ్యాప్తి ఇంకా కొనసాగుతూనే ఉంది. కానీ దాని ప్రభావం తగ్గిపోవడంతో ప్రజలంతా దాని గురించి మర్చిపోయి ఫ్రీగా తిరగడం మొదలుపెట్టేశారు. కొన్నిచోట్ల అయితే వారు కనీసం మాస్క్‌లు పెట్టుకోవడానికి కూడా ఇష్టపడట్లేదు. కరోనా తగ్గిపోయిందంటూ ఓపెన్ స్టేట్‌మెంట్స్ ఇచ్చేస్తున్నారు. కర్ణాటకలో జరిగిన ఓ ఘటన ఇలాంటి వారిని అలర్ట్ అయ్యేలా చేస్తోంది.

కర్ణాటకలోని ధర్వాడ్‌లో ఉన్న ఎస్‌డీఎమ్ మెడికల్ కాలేజ్ పేరు ఇప్పుడు అంతటా వినిపిస్తోంది. ఎందుకంటే ఈ కాలేజీలో విద్యార్థులు, స్టాఫ్.. అందరు కలిపి కరోనా బారినపడిన వారి సంఖ్య 182కు చేరింది. దీనంతటికి కారణం ఒక్క ఫ్రెషర్స్ పార్టీ. ఇటీవల ఈ కాలేజ్‌లో జరిగిన ఓ ఫ్రెషర్స్ పార్టీలో ఓ కోవిడ్ పాజిటివ్ పేషెంట్ ఉన్నారన్న అనుమానంతో కాలేజీ యాజమాన్యం విద్యార్థులందరికీ టెస్ట్ చేయించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

ముందుగా 300 మంది విద్యార్థులకు కోవిడ్ టెస్ట్ చేయించగా అందులో 66 మందికి పాజిటివ్ అని తెలింది. ఇక మిగిలిన విద్యార్థులకు కూడా ఈరోజు టెస్టులు ముగిశాయి. ప్రస్తుతం 182 మంది విద్యార్థులు కోవిడ్ బారిన పడినట్టుగా యాజమాన్యం వెల్లడించింది. కాకపోతే వారిలో కోవిడ్ అంతగా ప్రభావితం కాదని పరీక్షలు జరిపిన వైద్యులు అంటున్నారు.

కోవిడ్ బారిన పడిన విద్యార్థులందరికీ క్యాంపస్‌లోనే ట్రీట్‌మెంట్‌ను అందజేస్తున్నారు. మిగిలిన అందరికీ కూడా టెస్టులు చేయడం మంచిదని వైద్యులు సూచించారు. గత కొన్ని వారాలుగా కర్ణాటకలో కోవిడ్ కేసులు విపరీతంగా తగ్గిపోతున్నాయి. కానీ ఈ ఘటన వల్ల.. మళ్లీ ఆ రాష్ట్రంలో కోవిడ్ శాతం పెరిగింది. విద్యార్థులు సురక్షితంగా ఉండేందుకు ఎస్‌డీఎమ్ మెడికల్ కాలేజ్ యాజమాన్యం తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది.

Tags:    

Similar News