హాత్రాస్ బాధితురాలి పోస్ట్ మార్టం రిపోర్ట్.. కన్నీళ్లు పెట్టించే దారుణాలు వెలుగులోకి
బాధితురాలి పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది. అందులోనూ కన్నీళ్లు పెట్టించే దారుణాలు వెలుగు చూశాయి
పాషాణ హృదయాలను సైతం కరిగించే దారుణం ఇది. మెడ పిసికి, నాలుక తెగ్గోసి, కాళ్లు, చేతులు చచ్చుబడిపోయేలా చేసి.. చివరికి ఆమె ప్రాణమే తీశారు కిరాతకులు. నిర్భయ ఘటనకు ఏమాత్రం తీసిపోని విధంగా బాధితురాలి ప్రైవేట్ పార్టులపై రాక్షసత్వానికి ఒడిగట్టారు. అత్యంత దారుణమైన హత్రాస్ ఘటన దేశాన్నే కుదిపేస్తోంది. కానీ పోలీసుల వర్షన్ మాత్రం భిన్నంగా ఉంది. నరరూప రాక్షసులు గొంతుకు చున్నీ చుట్టి గట్టిగా లాగే సమయంలో బాధితురాలి పళ్లగాటుకు నాలుక తెగిపడినట్లు చెప్తున్నారు. అర్ధరాత్రి హడావుడిగా దహన సంస్కారాలు చేసిన పోలీసులు... అసలు రేపే జరగలేదంటున్నారు. మరి అత్యాచారం జరగకపోతే హడావుడిగా ఎందుకు దహన సంస్కారాలు చేశారు? పెళ్లికాని యువతికి వారి ఆచారం ప్రకారం ఖననం చేస్తారు. వాళ్ల ఆచారాన్ని కాదని ఎందుకు దహనం చేశారు? ఖననం చేస్తే రీపోస్ట్ మార్టం చేసే అవకాశం ఉందనే భయమా? కాల్చేస్తే సాక్ష్యాలు మిగలవనే ఉద్దేశంతోనే దహనం చేశారా? బాధితురాలి కుటుంబసభ్యులు అడిగే ప్రశ్నలకు పోలీసులు ఏం సమాధానం చెప్తారు?
బాధితురాలి పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది. అందులోనూ కన్నీళ్లు పెట్టించే దారుణాలు వెలుగు చూశాయి. ఆమె ప్రైవేట్ పార్ట్‌లపై తీవ్ర గాయాలు ఉన్నట్లు రిపోర్టు వెల్లడించింది. కానీ అత్యాచారం జరిగిందా? లేదా? అనే విషయం మాత్రం వెల్లడించలేదు. అయితే బాధితురాలి పట్ల కిరాతకులు అత్యంత పైశాచికంగా ప్రవర్తించినట్లు పోస్ట్ మార్టం రిపోర్టు స్పష్టం చేసింది. బాధితురాలి మెడను గట్టిగా పిసికేసినట్లు రిపోర్టు వెల్లడించింది. దీంతో బాధితురాలి మెడ ఎముకలు విరిగాయని, దాని వల్ల బాధితురాలి కాళ్లు, చేతులు చచ్చుబడిపోయినట్లు వివరించింది. మరోవైపు బాధితురాలు శ్వాసతీసుకోడానికి చివరి క్షణాల వరకు ఇబ్బంది పడినట్లు కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.