Kerala Rains: కేరళలో పలుజిల్లాలకు రెడ్‌ అలెర్ట్‌.. రానున్న 24 గంటలు ఇదే పరిస్థితి..

Kerala Rains: అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా కేరళను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి.

Update: 2021-10-17 10:45 GMT

Kerala Rains (tv5news.in)

Kerala Rains: అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా కేరళను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. పథనంతిట్ట, కొట్టాయంలతో పాటు ఎర్నాకుళం, ఇడుక్కి, త్రిశూర్, పాలక్కాడ్ జిల్లాలు వర్షం భీభత్సంతో అల్లాడిపోయాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు, రహాదారులు నీటమునిగాయి. వాగులు వంకలు ప్రమాదకర స్ధాయిలో పొంగిపొర్లుతున్నాయి. జలాశయాల్లో నీటి మట్టాలు గరిష్టస్ధాయికి చేరుకుంటున్నాయి.

ఈనేపథ్యంలో వాతావరణ శాఖ.. తిరువనంతపురం, కొల్లాం, అలపుజ, పాలక్కాడ్, మలప్పురం, కోజికోడ్, వయనాడ్ జిల్లాలతో సహా ఏడు జిల్లాల్లో రెడ్ అలెర్ట్ ను జారీ చేసింది. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో.. నదులు పొంగి ప్రవహిస్తున్నాయి కనుక పర్యాటక ప్రదేశాలను సందర్శించడానికి నదుల వద్దకు వెళ్లవద్దని జిల్లా కలెక్టర్ నవజ్యోత్ ఖోసా ప్రజలకు సూచించారు.

జిల్లాలోని నెయ్యార్ డ్యాం , అరువుక్కర డ్యామ్ నీటి మట్టం పెరుగుతుందని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలను జారీ చేశారు. మరోవైపు కొల్లాం , కొట్టాయం జిల్లాలతో సహా అనేక ప్రదేశాలలో రహదారులు నదులను తలపిస్తున్నాయి. భారీ వర్షాలకు కుట్టనాడ్ ప్రాంతంలో జనజీవితం అస్తవ్యస్తమయ్యింది. కుట్టనాడ్ ను కేరళ 'రైస్ బౌల్' అని పిలుస్తారు.

కొట్టాయం , కొండ జిల్లా ఇడుక్కిలో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళమని అధికారులు సూచిస్తున్నారు. సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని మత్య్సకారులను హెచ్చరించారు. రాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి రెవెన్యూ మంత్రి కె రాజన్ ఆన్‌లైన్ ద్వారా జిల్లా కలెక్టర్లతో సమావేశం కానున్నారు.

మీనాచల్ , మణిమాలతో సహా అనేక నదులలో నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో విస్తారంగా భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించినట్లు ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు. రానున్న 24 గంటలు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఇప్పటికే కొన్ని నదులలో నీటి మట్టం పెరుగుతుందని, ఇక ఆనకట్టలు పొంగిపొర్లుతాయని అంచనా వేస్తున్నారు. దీంతో పరివాహక ప్రాంతాల్లో నివసించే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని.. అత్యవసర సహాయం అందించడానికి అధికారుల సిద్ధంగా ఉండాలని సీఎం చెప్పారు.

కాగా, శబరిమల ఆలయం ఆదివారం ఉదయం తెరచుకున్నది. అయితే భారీ వర్షాల నేపథ్యంలో భక్తులు స్వామి దర్శనానికి రాకుండా ఉండటమే మంచిదని ఆలయ బోర్డు సూచించింది. తూల మాసం పూజల కోసం శబరిమల ఆలయాన్ని అధికారులు తెరిచారు. ఆదివారం నుంచి ఈ నెల 21 వరకు అయ్యప్ప ఆలయంలోకి భక్తులకు అనుమతిస్తారు.

తమిళనాడులోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కన్యాకుమారి జిల్లాను వర్షాలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాలతో పలుచోట్ల వరదలు పోటెత్తాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలతో తిరపరప్పు జలపాతం ఉధృతంగా ప్రవహిస్తున్నది.

Tags:    

Similar News