Mulayam Singh Yadav: యూపీకి సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా పని చేసిన ములాయం.. శోకసంద్రంలో ఉత్తర్‌ప్రదేశ్
Mulayam Singh Yadav: ములాయం.. ఓ సమాంతర ప్రజాస్వామ్య వేదికను సృష్టించారు. కాంగ్రెస్ వారసత్వాన్ని సవాల్ చేసి జాతీయ నేతగా ఎదిగారు.;
Mulayam Singh Yadav: ములాయం.. ఓ సమాంతర ప్రజాస్వామ్య వేదికను సృష్టించారు. కాంగ్రెస్ వారసత్వాన్ని సవాల్ చేసి జాతీయ నేతగా ఎదిగారు. బీజేపీ దూకుడుకు కళ్లెం వేసి....తన శక్తియుక్తులతో వామపక్ష సిద్థాంతాలను తిప్పికొట్టారు.ప్రాంతీయ పార్టీలు జాతీయ స్థాయిలో గళం వినిపించేందుకు బాటలు వేశారు.
రాష్ట్రాల న్యాయమైన డిమాండ్లను కేంద్రం పరిశీలించేలా పరిస్థితులు తీసుకువచ్చారు. అంతటి ఛరిష్మ కలిగిన సమాజ్‌వాదీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్..చివరి రోజుల్లో పార్టీలో, యూపీలో పట్టు కోల్పోయాడు
ములాయం మరణంతో ఉత్తరప్రదేశ్ శోకసంద్రంలో మునిగిపోయింది. సాధారణ కార్యకర్త నుంచి అంచెలంచెలుగా ఎదిగిన ములాయం...యూపీకి సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా పని చేశారు. 1975 ఎమర్జెన్సీ కాలంలో 19 నెలల పాటు జైలు జీవితం గడిపారు. పది సార్లు ఎమ్మెల్యేగా, 7 సార్లు ఎంపీగా గెలిచి...రాజకీయంలో తనకు తిరుగులేదని నిరూపించుకున్నారు.
ఉత్తరప్రదేశ్ రాజకీయాలను దశాబ్ధాల పాటు శాసించిన ములాయం. 1939 నవంబర్ 22 ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఇటావా జిల్లా సైఫాయ్ గ్రామంలో జన్మించారు. పొలిటికల్ సైన్స్‌లో MA చేసిన ములాయం..తర్వాత రాజకీయాల వైపు అడుగులేశారు. రామ్ మనోహర్ లోహియా, రాజ్‌నారాయణ్ వంటి నేతల మార్గంలో రాజకీయ ఓనమాలు దిద్దారు.
1967లో జశ్వంత్ నగర్ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన..అక్కడి నుంచి రాజకీయాల్లో వెనుదిరిగి చూడలేదు. ఆ స్థానం నుంచి దాదాపు 8 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1977లో తొలిసారి రాష్ట్ర కేబినెట్‌లో చోటు దక్కించుకున్నారు. 1980లో లోక్‌దళ్ పార్టీకి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
తర్వాత లోక్‌దళ్ పార్టీ జనతా దళ్‌లో విలీనమైంది.1982లో యూపీ శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా ఎన్నికయ్యారు ములాయం. లోక్‌దళ్ పార్టీ చీలడంతో క్రాంతికారి పేరుతో పార్టీని స్థాపించారు.
1992లో సమాజ్‌వాదీ పార్టీని స్థాపించిన ములాయం సింగ్..ఉత్తరప్రదేశ్‌లో దానిని తిరుగులేని శక్తిగా మార్చారు. ఆకట్టుకునే ప్రసంగాలు, ఎదురులేని రాజకీయ వ్యూహాలతో సమాజ్‌వాదీని తక్కువ కాలంలోనే అధికారానికి చేరువ చేశారు. పార్టీ స్థాపించిన సంవత్సర కాలంలోనే బీఎస్పీతో కలిసి ఎన్నికలకు వెళ్లిన ములాయం పార్టీ మంచి ఫలితాలను సాధించింది.
1989లో మొదటిసారి సీఎంగా ఎన్నికైన ములాయం...1993లో రెండోసారి, 2003లో మూడో సారి ఆ బాధ్యతలు స్వీకరించారు. 2003లో సీఎం బాధ్యతలు స్వీకరించినప్పుడు ఆయన ఎంపీగా ఉన్నారు. తర్వాత గున్నౌర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేశారు ములాయం. ఆ ఎన్నికల్లో ఆయనకు 94 శాతం ఓట్లు పోలవడంతో రికార్డు స్థాయి విజయం సాధించారు.
1996లో మెయిన్‌పురి నుంచి 11వ లోక్‌సభకు ఎన్నికయ్యారు ములాయం. ఆ సంవత్సరం ఏర్పడిన యునైటెడ్ ఫ్రంట్ సంకీర్ణ సర్కార్‌లో రక్షణ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1999లో సంభాల్, కన్నౌజ్ రెండు స్థానాల నుంచి పోటీ చేసి గెలుపొందారు. తర్వాత ఉప ఎన్నికల్లో కుమారుడు అఖిలేష్ కోసం కన్నౌజ్ స్థానానికి రాజీనామా చేశారు.