కరోనా ఉధృతి.. 16 రాష్ట్రాల జాబితాలో తెలుగు రాష్ట్రాలు
దేశంలో కరోనా విజృంభణ చూస్తుంటే పరిస్థితి చేయి దాటినట్టే కనిపిస్తోంది. ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాలు సేఫ్ అనుకున్నది కాస్తా... ఉధృతంగా ఉన్న 16 రాష్ట్రాల జాబితాలోకి చేరుకున్నాయి.;
దేశంలో కరోనా విజృంభణ చూస్తుంటే పరిస్థితి చేయి దాటినట్టే కనిపిస్తోంది. ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాలు సేఫ్ అనుకున్నది కాస్తా... ఉధృతంగా ఉన్న 16 రాష్ట్రాల జాబితాలోకి చేరుకున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే.. ఆస్పత్రుల్లో బెడ్లు కూడా దొరకని పరిస్థితి వస్తుందని హెచ్చరిస్తున్నారు.
మాస్కులు, భౌతికదూరం, శానిటైజర్లతో జాగ్రత్తలు తీసుకోకపోతే... కనీసం ట్రీట్‌మెంట్ చేయించుకోడానికి కూడా ఖాళీ దొరకని పరిస్థితి ఉంటుందని గట్టిగా చెబుతున్నారు. ఇప్పటికే, హైదరాబాద్‌లోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో బెడ్స్ ఖాళీగా లేవు. అంచనా వేసిన దానికంటే ఎక్కువ సంఖ్యలో కరోనా కేసులు వస్తుండడంతో పరిస్థితులు చేయి దాటేలా కనిపిస్తున్నాయి.
తెలంగాణలో సెకండ్ వేవ్‌లో వైరస్ వేగంగా విస్తరిస్తోందని వైద్య ఆరోగ్య శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. గత నాలుగు వారాల్లో కోవిడ్ కేసులు ప్రమాదకర స్థాయిలో పెరిగాయని... ఏప్రిల్ చివరికల్లా తెలంగాణలో మరింత భారీగా పాజిటివ్ కేసులు నమోదవుతాయని... డీహెచ్ శ్రీనివాసరావు తెలిపారు.
ప్రజలు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని.. లేదంటే రాష్ట్రం మరో మహారాష్ట్రలా మారుతుందని హెచ్చరించారు. వాస్తవానికి లాక్‌డౌన్ విధించే పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నా... ప్రజల ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని కర్ఫ్యూ గానీ, లాక్‌డౌన్ గానీ విధించడం లేదని... ప్రజలందరూ దీన్ని అర్థం చేసుకుని.. కరోనా విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ... డీహెచ్ శ్రీనివాసరావు సూచించారు.
ఇక ఉత్తరాది రాష్ట్రాల్లో అయితే పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. ఆస్పత్రుల్లో బెడ్లు ఖాళీగా లేక.. అంబులెన్సుల్లోనే ఆక్సిజన్ పెట్టించుకుంటున్నారు. ఆస్పత్రి వరండాలో, ఆవరణలో ఇలా ఎక్కడపడితే అక్కడ ట్రీట్‌మెంట్ చేయించుకునే పరిస్థితి ఉంది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఓ ఆస్పత్రి వద్ద ఆంబులెన్సులు క్యూలు కట్టాయి.
ఇందులో ఉన్న వాళ్లంతా కరోనా కారణంగా అత్యవసర ట్రీట్‌మెంట్‌కు వచ్చిన వాళ్లే. కాని, హాస్పిటల్ లోపల ఖాళీ లేకపోవడంతో.. అంబులెన్స్‌లోనే ఆక్సిజన్ ఎక్కించుకుంటూ, ట్రీట్‌మెంట్ పొందుతున్నారు. ఈ దృశ్యాలు చూసిన హర్భజన్ సైతం.. అందరూ కోలుకోవాలని దేవున్ని ప్రార్థిస్తూ ట్వీట్ చేశాడు.
ఢిల్లీలో సైతం కరోనా బాధితుల కోసం కేటాయించిన పడకలన్నీ నిండిపోతున్నాయి. ఢిల్లీలో కరోనా సోకిన వారి కోసం వెంటిలేటర్‌తో కూడిన ఐసీయూ పడకలను సిద్థం చేశారు. మొత్తం 1,117 బెడ్స్ రెడీగా ఉంచితే.. అందులో 79 మాత్రమే ఖాళీగా ఉన్నాయి. వెంటిలేటర్ లేని ఐసీయూల్లో 348 పడకలు మాత్రమే ఖాళీగా ఉన్నాయి.
కరోనా పేషెంట్ల కోసం 13వేల 680 బెడ్లు రెడీగా ఉంచారు. వీటిలో మరో నాలుగువేల పడకలు మాత్రమే ఖాళీగా ఉన్నాయి. కరోనా కేసులు ఇలాగే కొనసాగితే మరో గుజరాత్, ఛత్తీస్‌గఢ్ పరిస్థితులు ఢిల్లీలోనూ కనిపిస్తాయి.