ఈనెల 24న అమెరికాలో పర్యటించనున్న ప్రధాని మోదీ..!
ఈనెల 24న అమెరికాలో పర్యటించనున్నారు ప్రధాని మోదీ. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో సమావేశం కానున్నారు;
ఈనెల 24న అమెరికాలో పర్యటించనున్నారు ప్రధాని మోదీ. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో సమావేశం కానున్నారు. వచ్చే వారం అమెరికా వెళ్లనున్న మోదీ.. రెండు రోజుల పాటు అక్కడే ఉంటారు. బైడెన్ ఆతిథ్యంలో జరగనున్న క్వాడ్ నేతల సదస్సులో మోదీ పాల్గొంటారు. సెప్టెంబరు 24న వాషింగ్టన్‌లో మోదీ, బైడెన్, ఆస్ట్రేలియా ప్రధాని మారిసన్, జపాన్ ప్రధాని యోషి హిడే మధ్య క్వాడ్ సదస్సు జరగనుంది. ఈ సదస్సు తరువాత ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలోనూ ప్రసంగిస్తారు.
అమెరికాలోని మాడిసన్‌లో జరిగిన హౌడీ మోడీ సభలో పాల్గొన్న తరువాత.. ప్రధాని అమెరికాలో పర్యటించడం ఇదే మొదటిసారి. ఆనాడు ట్రంప్‌ను మరోసారి అధ్యక్షుడిగా గెలిపిద్దాం అని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో బైడెన్, మోదీ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. ఇక కరోనా ప్రధాన ఎజెండాగా క్వాడ్ సదస్సు జరగనుంది. వ్యాక్సినేషన్‌తో పాటు సైబర్ భద్రత, సముద్ర జలాల భద్రత, వాతావరణ మార్పులు, విద్య, సాంకేతికత అంశాలపై క్వాడ్ నేతలు చర్చిస్తారు. ఆఫ్గాన్‌లో తాలిబన్ల రాజ్యంతో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, తాలిబన్ల పాలనతో ఎదురయ్యే సవాళ్లను చర్చించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.