Sonu Sood: క్యాన్సర్ రోగి కోరికను నెరవేర్చిన సోను సూద్..
మహమ్మారి సమయంలో బాధితులకు అండగా నిలబడుతున్న సోనూ సూద్ పేరు మార్మోగిపోతోంది.;
Sonu Sood: మహమ్మారి సమయంలో బాధితులకు అండగా నిలబడుతున్న సోనూ సూద్ పేరు మార్మోగిపోతోంది. లెక్కలేనన్ని కుటుంబాలకు సహాయం చేస్తూ రియల్ హీరో అనిపించుకుంటున్నారు. అయితే, అతని స్వచ్ఛంద కార్యక్రమాలు కేవలం కోవిడ్ రోగులకు మాత్రమే పరిమితం కాలేదు. తన సేవలను విస్తరించారు. ఎవరికి ఏ సహాయం కావాలన్నా సోనూ వైపే చూస్తున్నారు.
ఈ నటుడు తన అభిమానుల పట్ల కృతజ్ఞతా పూర్వకంగా ఉంటారు. వారిని కలవడం నుండి సోషల్ మీడియాలో వారి సందేశాలకు స్పందించడం వరకు, సోను తన సమయాన్ని వెచ్చిస్తారు. ఇది కూడా ఆయన ప్రజల హృదయాలను గెలుచుకునేందుకు కారణమైంది. ఇటీవల, అతను క్యాన్సర్ రోగి కోరికను నెరవేర్చాడు, అతను సోనూని కలవాలనుకున్నాడు. క్యాన్సర్ పేషెంట్ అయిన అభిషేక్ జైన్‌ను సోను ముంబైలోని తన నివాసం వెలుపల కలిశారు.
అతను సోనూ సూద్‌ని చూసి తన కన్నీళ్లను ఆపుకోలేకపోయాడు. సోనూ పాదాలు తాకేందుకు కిందకు వంగాడు. అలా చేయవద్దంటూ వారిస్తూ సోనూ అతడిని పైకి లేపారు. అభిషేక్ జైన్ చేతికి ఫోన్ ఇచ్చి నేనే నీకు ఫోన్ చేస్తా అని అతడిని ఆశ్చర్యపరిచారు సోనూ సూద్.
ట్విట్టర్‌లో ఒక యూజర్ షేర్ చేసిన వీడియోపై స్పందించిన సోను, దేశవ్యాప్తంగా అభిమానుల నుంచి తనకు లభిస్తున్న ప్రేమకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పారు. "ప్రజలు ప్రతిరోజూ ఎంతో ప్రేమను కురిపిస్తున్నారు. నేను నా జీవితంలో ఓ మంచి పని చేస్తున్నందుకు చాలా తృప్తిగా ఉంది. వారి కష్టాలన్నీ ముగియాలని నేను ప్రార్థిస్తున్నాను అని రాశారు. కాగా, సోనూ సూద్ ఇ. నివాస్ దర్శకత్వంలో వస్తున్న 'కిసాన్' చిత్రంలో నటించనున్నారు. తెలుగులో చిరంజీవి చిత్రం 'ఆచార్య'లో కీలక పాత్ర పోషిస్తున్నారు.