China Taiwan War : మాట లెక్కచేయని తైవాన్.. రెచ్చిపోతున్న చైనా..
China Taiwan War : అమెరికా ప్రతనిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ పర్యటన తర్వాత చైనా, తైవాన్ మధ్య వైరం మరింత పెరిగింది.;
China Taiwan War : అమెరికా ప్రతనిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ పర్యటన తర్వాత చైనా, తైవాన్ మధ్య రోజురోజుకు ఉద్రిక్తతలు ముదురుతున్నాయి. యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. తైవాన్ తమ అంతర్భాగంగా భావిస్తున్న చైనా... పెలోసీ పర్యటించి వెళ్లాక కోపంతో రగిలిపోతోంది. పెలోసీకి అతిథ్యమిచ్చిన తైవాన్‌ను శిక్షించాలని బలంగా కోరుకుంటోంది. అందులో భాగంగా తైవాన్ ద్వీపం చుట్టూ భారీ మిలిటరీ కసరత్తులు చేస్తోంది.
తైవాన్‌పై ఆర్థికపరమైన ఆంక్షలు విధించడమే గాక, గత గురువారం నుంచి ద్వీప దేశం చుట్టూ భారీ విన్యాసాలు ప్రారంభించింది. అంతేగాక, చైనా, కొరియన్ పెనిన్సులా మధ్య ఉన్న యెల్లో సముద్రంలో లైవ్ ఫైర్ డ్రిల్ చేపట్టింది. ఈ విన్యాసాలు ఆగస్టు 15 వరకు కొనసాగిస్తామని బీజింగ్ ప్రకటించింది. ఫైటర్ జెట్‌లు, యుద్ధనౌకలు, బాలిస్టిక్ కిపణులను చైనా మోహరించింది.
మరోవైపు చైనా సైనిక విన్యాసాలపై తైవాన్ తీవ్రంగా స్పందించింది. తమ ప్రధాన భూభాగంపై దాడికి డ్రాగన్ సన్నాహాలు చేస్తోందని ఆరోపించింది. తైవాన్ జలసంధిలో చైనాకు చెందిన యుద్ధ విమానాలు, నౌకలు భారీ సంఖ్యలో మోహరించి సైనిక విన్యాసాలు చేస్తున్నాయని, కొన్ని చోట్ల నియంత్రణ రేఖను దాటి ఈ నౌకలు తమ జలాల్లో ప్రవేశించాయని తైవాన్ రక్షణశాఖ వెల్లడించింది. ఇవన్నీ చూస్తుంటే డ్రాగన్ తమ భూభాగంపై దాడి చేయడం కోసమే ఈ సన్నాహాలు చేస్తున్నట్లు అర్థమవుతోందని పేర్కొంది. విన్యాసాల్లో భాగంగా చైనా క్షిపణులు కొన్ని తైవాన్ మీదుగా ప్రయాణించినట్లు వీడీయోలను విడుదల చేసింది.
తైవాన్ రక్షణ రంగానికి చెందిన ఓ కీలక అధికారి అనుమానాస్పద రీతిలో మృతిచెందారు. అతను తైవాన్ క్షిపణి అభివృద్ధి బృందానికి నేతృత్వం వహిస్తున్నారు. దీని వెనకాల చైనా ఉందని తైవాన్ అనుమానిస్తోంది.