ఫిబ్రవరిలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు... ఆందోళనలో శాస్త్రజ్ఞులు

Update: 2023-02-26 06:19 GMT

మనదేశంలో కొన్ని ప్రాంతాల్లో ఫిబ్రవరిలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదుకావడం వాతావరణ శాస్త్రజ్ఞులకు ఆందోళన కలిగిస్తున్న అంశం. ఇప్పటికే దేశంలో ఉష్ణోగ్రతలు 40డిగ్రీల సెల్సియస్‌కు చేరడం పెరుగుతున్న భూ తాపాన్ని బయటపెడుతుంది. ఈ పరిణామం ఆహార భద్రతపై మాత్రమే కాకుండా ఆర్థిక వ్యవస్థలోని వివిధ రంగాలపై ప్రభావం చూపనుంది.ఈ ఏడాది వేడిగాలులు తీవ్రంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ప్రభావం తాగునీరు, విద్యుత్‌ సంక్షోభానికి దారితీయవచ్చని తెలిపింది.

మరోవైపు భూతాపం పెరగడంతో సంభవించే విపత్తును నివారించడానికి, సంక్షోభాన్ని ఎదుర్కోవటానికి దేశానికి సమగ్ర విధానం, వ్యూహం అవసరం.గత మార్చిలో వేడిగాలుల ప్రభావంతో గోదుమల ఉత్పత్తి క్షీణించింది.గోధుమ పంటపై 5 నుండి10 శాతంప్రభావం చూపుతాయని, విత్తన పంటలు 40శాతం వరకు తీవ్రంగా నష్టపోయే అవకాశంఉందని వాతావరణ విభాగం అంచనా వేసింది.

అత్యంత జనసాంద్రత కలిగిన దేశాలలో భారత్‌ మొదటి వరసలో ఉంది.తీవ్రమైన ఉష్ణోగ్రత, వేడిగాలులు మానవ ఆరోగ్యంపై మాత్రమే కాకుండా పర్యావరణం,వ్యవసాయం, నీరు, ఇంధన సరఫరాలు, ఆర్థిక వ్యవస్థలోని అన్ని రంగాలపై కూడా ప్రభావం చూపుతాయి. వాతావరణ మార్పులతో దేశంలో ప్రతికూల ప్రభావాలు తీవ్రమవుతున్న నేపథ్యంలో ప్రపంచ వాతావరణ సంస్థ బహుళ ప్రమాద ప్రణాళిక అవసరాన్ని మరోసారి గుర్తుచేసింది.

వాయవ్య భారతంలో నెలకొన్న భూ ఉపరితల ఉష్ణోగ్రతలు 55 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకోనుందని, మే మొదటి వారంలో కొన్ని ప్రాంతాల్లో 60 డిగ్రీలను దాటే అవకాశం ఉన్నట్లు శాటిలైట్‌లు సమాచారాన్ని ఇస్తున్నాయి.అందుకు తగ్గట్లే ఫిబ్రవరిలోనే వేడిగాలులు ప్రారంభమయ్యాయి. దక్షిణాసియాలో వేడిగాలులు, తేమతో కూడిన వేడి ఈ శతాబ్దంలోనే లేనంత అధికంగా ఉంటుందని వాతావరణ మార్పులపై ఇంటర్‌ గవర్నమెంటల్‌ ప్యానెల్‌ తన 6వ అంచనా నివేదికలో తెలిపింది.అమెరికాకు చెందిన ఇంటర్నేషనల్‌ ఫుడ్‌ పాలసీ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ కూడా ఈ అంశంపై ప్రపంచ దేశాలను హెచ్చరించింది.

Similar News