ఏపీలో రాగల రెండురోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు!

కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం.

Update: 2020-08-27 03:38 GMT

ఏపీలో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర ఒడిషా, పశ్చిమ బెంగాల్‌ తీరాల్ని ఆనుకొని వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ఈ అల్పపీడనం క్రమంగా జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తర మధ్యప్రదేశ్‌ వైపు వెళుతోంది. దీనికి అనుబంధంగా 7.6 కిమీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. మరోవైపు ఉత్తర–దక్షిణ ద్రోణి రాయలసీమ నుంచి దక్షిణ తెలంగాణ వరకూ 0.9 కిమీ ఎత్తులో ఉంది.

వీటి ప్రభావంతో ఏపీలో పలు ప్రాంతాల్లో రాగల రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని విశాఖపట్నం వాతావరణ కేంద్రం వెల్లడించింది. గురువారం ఉత్తర కోస్తాలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది.  

Tags:    

Similar News