Rahul Gandhi Campaign : తెలంగాణతో తనకు బంధం ఉందన్న రాహుల్
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే - కులగణన;
శాసనసభ ఎన్నికల గడువు సమీపిస్తుండటంతో... కాంగ్రెస్ ప్రచారజోరు పెంచింది. ఒకే రోజు 3నియోజకవర్గాల్లో ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ పర్యటించారు. ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న రాహుల్.... అక్కడి నుంచి హెలీక్యాప్టర్‌లో నేరుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరుకు చేరుకున్నారు. పినపాక నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి పాయం వెంకటేశ్వర్లుకు మద్దతుగా రోడ్‌షో నిర్వహించిన రాహుల్.... కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను వివరించారు. కాంగ్రెస్ ఏం చేసిందని ప్రశ్నిస్తున్న భారాస విమర్శలను తిప్పికొట్టారు. కేసీఆర్ చదువుకున్న పాఠశాల, కళాశాల కట్టిందే కాంగ్రెస్సేనని బదులిచ్చారు.
అనంతరం వరంగల్ జిల్లా నర్సంపేటకు చేరుకున్న రాహుల్‌గాంధీ కాంగ్రెస్ అభ్యర్థి దొంతి మాధవరెడ్డితో కలిసి రోడ్‌షో నిర్వహించారు. రాహుల్ రోడ్‌షోకు నియోజవర్గంలోని పెద్దఎత్తున జనం తరలివచ్చారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలను మొదటి మంత్రివర్గ భేటీలోనే తమ ప్రభుత్వం అమలుచేస్తుందని రాహుల్ భరోసానిచ్చారు.
నర్సంపేట పర్యటన అనంతరం వరంగల్ నగరానికి బయలుదేరిన రాహుల్‌గాంధీ పశ్చిమ నియోజకవర్గ పరిధిలో పాదయాత్ర చేశారు. వరంగల్ తూర్పు, పశ్చిమ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థులు కొండా సురేఖ, నాయిని రాజేందర్‌రెడ్డితోపాటు కాంగ్రెస్ నేతలు, వేలాదిగా తరలివచ్చిన జనంతో కలిసి.... ఓరుగల్లు నగరంలో రాహుల్ ముందుకు సాగారు. పోచమ్మ మైదానం నుంచి రుద్రమదేవీ కూడలి వరకు పరిసరాలు... జనసందోహంగా మారాయి. రుద్రమదేవీ కూడలిలో ప్రజలనుద్దేశించిన ప్రసంగించిన రాహుల్..... భాజపా, భారాసలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్, మోదీ ప్రభుత్వాలను పెకిలించటమే కాంగ్రెస్ లక్ష్యమన్నారు. భారాసను గద్దెదించి, అధికారమే లక్ష్యంగా సర్వశక్తులొడ్డుతున్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం, అభ్యర్థులు, ఆ పార్టీ శ్రేణుల్లో రాహుల్ తాజా పర్యటన జోష్‌ను నింపింది.
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రగతి భవన్ పేరును మారుస్తామని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తెలిపారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా అనుసంధాన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ విజయం ప్రజల తెలంగాణ అనే స్వర్ణయుగానికి నాంది పలుకుతుందని పేర్కొన్నారు. తాము అధికారంలోకి రాగానే ప్రగతి భవన్‌కు ప్రజా పాలనా భవనం అని పేరు మారుస్తామన్నారు. అప్పుడు ప్రజలందరికీ ఈ తలుపులు 24 గంటలు తెరిచే ఉంటాయని చెప్పారు.
ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను తీసుకోవడానికి ఇరవై నాలుగు గంటలు తెరిచి ఉండటంతో పాటు ప్రజా సమస్యలను 72 గంటల్లో పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి, మంత్రులు అందరూ క్రమం తప్పకుండా ప్రజా దర్బార్‌లు నిర్వహిస్తారన్నారు. జవాబుదారీతనం, పారదర్శకతతో కూడిన ప్రజా తెలంగాణ కోసం తెలంగాణ ప్రజానీకం తమతో కలిసి రావాలని కోరారు.