ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ జిల్లాలో దారుణం జరిగింది. 11 ఏళ్ల మూగ, చెవిటి బాలికపై అత్యాచారం జరిగింది. బాలిక మంగళవారం సాయంత్రం నుంచి కనిపించకుండా పోయింది. దీంతో కుటుంబ సభ్యులు ఆచూకీ కోసం వెతికారు. బుధవారం ఉదయం పొలంలో నగ్నంగా గాయాలతో ప్రత్యక్షమైంది. దీంతో షాక్‌కు గురయ్యారు.
బాధిత కుటుంబం ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. బాలికపై దారుణంగా అత్యాచారం జరిగినట్లుగా గుర్తించారు. తీవ్రగాయాలతో అపస్మారక స్థితిలో కనిపించింది. ఒక నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. బాలికను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మెరుగైన చికిత్స కోసం మీరట్‌కు తరలించారు.
మైనర్‌పై అత్యాచారం మరియు లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (పోక్సో) చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం డాన్ సింగ్ (24) అనే యువకుడిని అనుమానితుడిగా అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకునే సమయంలో కాలుకు బుల్లెట్ తగిలినట్లు వెల్లడించారు.
ఇక బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్ అంజు సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. బాలికపై ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది అత్యాచారం చేసి ఉంటారని అంచనా వేశారు. ప్రైవేటు భాగాలపై అనేక గాయాలు ఉన్నట్లుగా వెల్లడించారు. ముఖంపై కూడా కొట్టిన ఆనవాళ్లు ఉన్నాయని చెప్పారు. భయంతో బాలిక ఏం చెప్పడం లేదని.. ఇది అత్యంత భయంకరమైన లైంగిక దాడిగా పేర్కొన్నారు.
రాంపూర్ పోలీస్ చీఫ్ విద్యా సాగర్ మిశ్రా మాట్లాడుతూ.. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు చెప్పారు. కుమార్తె మూగ, చెవిటి స్థితిలో ఉందని చెప్పారని తెలిపారు. నిందితుడిని పట్టుకునేందుకు మూడు బృందాలను ఏర్పాటు చేశామన్నారు. అరెస్ట్ చేసే సమయంలో ఎదురుకాల్పులు జరపడంతో పోలీసులు ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపారని పేర్కొన్నారు. నిందితుడి కాలులోకి బుల్లెట్ దిగింది అని చెప్పారు. సీసీటీవీ పుటేజ్‌లో బాలికతో నిందితుడు ఉన్నట్లు కనిపించిందని వివరించారు.