Karnataka : 13 ఏళ్ల బాలికపై ముగ్గురు మైనర్ బాలురు గ్యాంగ్ రేప్..
కస్టడీలో నిందితులు
కర్ణాటక రాష్ట్రం హుబ్బళ్లిలో ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కేవలం 13 ఏళ్ల వయసున్న ఒక బాలికపై 14 నుంచి 15 ఏళ్ల మధ్య వయసున్న ముగ్గురు బాలురు గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. పోలీసుల సమాచారం ప్రకారం.. బాలిక తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో, అదే ప్రాంతంలో నివసించే ముగ్గురు బాలురు ఆమెను ఎవరూలేని ప్రాంతానికి తీసుకెళ్లి లైంగిక దాడి చేశారు.
ఈ ఘటనపై హుబ్బళ్లి–ధార్వాడ్ పోలీస్ కమిషనర్ ఎన్. శశి కుమార్ మాట్లాడుతూ.. బాధిత బాలికకు తగిన రక్షణ కల్పించామని, ముగ్గురు నిందితులను కస్టడీలోకి తీసుకున్నామని తెలిపారు. ఈ ముగ్గురిలో ఇద్దరు హైస్కూల్‌లో చదువుతున్న విద్యార్థులు కాగా, మరో బాలుడు స్కూల్ మానేసిన డ్రాప్ అవుట్ అని ఆయన వెల్లడించారు. బాధిత బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు.. నిందితులు ఈ ఘటనను వీడియో తీసి బెదిరించారని పోలీసులు తెలిపారు. నిందితుల మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని, అన్ని కోణాల్లో దర్యాప్తు చేపడతామని కమిషనర్ స్పష్టం చేశారు. ఈ ఘటనపై పోలీసులు పాక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, తదుపరి చర్యలు తీసుకుంటున్నారు.