PM Modi: ఐఎస్ఎస్‌లో ఉన్న శుభాంశు శుక్లాతో మాట్లాడిన ప్రధాని మోదీ..
అంతరిక్షం నుంచి భారత్ చాలా పెద్దగా, గొప్పగా కనిపిస్తోంది.. అంతరిక్ష అనుభవాలను పంచుకున్న శుభాన్షు ..;
ఐఎస్ఎస్ లో ఉన్న భారత వ్యోమగామి సుభాంశు శుక్లాతో ప్రధాని మోదీ మాట్లాడారు. శుభాంశు శుక్లాను ప్రధాని మోదీ అభినందించారు. అలాగే ఆయన బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఐఎస్ఎస్ కు చేరుకోవడం గర్వంగా ఉందని ప్రధాని మోదీతో శుక్లా అన్నారు. అక్కడ మీరు సురక్షితంగా ఉన్నారా అని ప్రధాని మోదీ అడగ్గా.. తాను సురక్షితంగా ఉన్నానని శుక్లా తెలిపారు.
మీరు భూమికి దూరంగా ఉండొచ్చు కానీ భారతీయుల హృదయాలకు దగ్గరగానే ఉన్నారని శుక్లాతో ప్రధాని మోదీ అన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో శుభాంశు శుక్లాతో ప్రధాని మోదీ ముచ్చటించారు. యాక్సియం 4 మిషన్ ద్వారా శుభాంశు శుక్లా ఐఎస్ఎస్ లోకి వెళ్లారు. కాగా, అంతరిక్షంలో నిద్రించడానికి కష్టంగా ఉందన్నారు శుక్లా. ఇది నా ఒక్కడి ప్రయాణమే కాదు భారత ప్రయాణం అని చెప్పారాయన. దేశానికి ప్రాతినిధ్యం వహించడం గర్వంగా ఉందన్నారు.
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లోకి ప్రవేశించిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించారు భారత వైమానిక దళానికి చెందిన గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా. ‘నేడు, మీరు మా మాతృభూమికి దూరంగా ఉన్నారు. కానీ మీరు భారతీయుల హృదయాలకు అత్యంత సన్నిహితులు. ఆప్కే నామ్ మే భీ శుభ్ హై ఔర్ ఆప్కీ యాత్రా నయే యుగ్ కా శుభరంభ్ భీ హై” అని భారత వ్యోమగామితో ప్రధాని మోదీ అన్నారు. “ఇది నా ఒక్కడి ప్రయాణం కాదు, మన దేశం కూడా” అని శుక్లా బదులిచ్చారు. ఈ కొత్త అనుభవాలను తాను స్పాంజిలాగా గ్రహిస్తున్నానని చెప్పారు.
ఇప్పటివరకు అక్కడ ఏమేం చూశారో వివరించమని ప్రధాని అడగ్గా.. కక్ష్య నుండి రోజుకు 16 సార్లు సూర్యోదయం సూర్యాస్తమయాన్ని మనం చూస్తాము.. మన దేశం చాలా గొప్ప వేగంతో ముందుకు సాగుతోంది అని శుక్లా అన్నారు. ఇక్కడ ప్రతిదీ భిన్నంగా ఉందని ఆయన ప్రధానితో చెప్పారు. ”మేము ఒక సంవత్సరం పాటు శిక్షణ పొందాము. వివిధ వ్యవస్థల గురించి నేర్చుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత, ప్రతిదీ మారిపోయింది. ఇక్కడ, అంతరిక్షంలో గురుత్వాకర్షణ శక్తి లేనందున చిన్న విషయాలు కూడా భిన్నంగా ఉంటాయి. ఇక్కడ నిద్రపోవడం ఒక పెద్ద సవాల్. ఈ వాతావరణానికి అలవాటు పడటానికి కొంత సమయం పడుతుంది” అని ప్రధానమంత్రికి చెప్పారు శుభాంశు శుక్లా.
”భూమి పూర్తిగా ఒకటిగా కనిపిస్తుంది. బయటి నుండి ఏ సరిహద్దు కనిపించదు. మనం మొదటిసారి భారతదేశాన్ని చూసినప్పుడు, భారతదేశం నిజంగా చాలా గొప్పగా కనిపిస్తుంది, చాలా పెద్దదిగా కనిపిస్తుంది, మనం మ్యాప్‌లో చూసే దానికంటే చాలా పెద్దదిగా కనిపిస్తుంది. మనం భూమిని బయటి నుండి చూసినప్పుడు, ఎటువంటి సరిహద్దు లేదు, రాష్ట్రం లేదు, దేశాలు లేవు అనిపిస్తుంది. మనమందరం మానవాళిలో భాగం, భూమి మన ఒకే ఇల్లు, మనమందరం దానిలో ఉన్నాము” అని శుక్లా అన్నారు.
గురువారం నాడు, భూమి చుట్టూ 28 గంటల ప్రయాణం ముగించుకుని తమ అంతరిక్ష నౌక డాకింగ్‌కు చేరుకున్న తర్వాత, శుక్లా మరో ముగ్గురు వ్యోమగాములు ISS లోని కక్ష్య ప్రయోగశాలలోకి ప్రవేశించారు. “మీ ప్రేమ ఆశీర్వాదాలతో, నేను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నాను. ఇక్కడ నిలబడటం సులభం అనిపిస్తుంది. కానీ నా తల కొంచెం బరువుగా ఉంది. కొంత ఇబ్బందిని ఎదుర్కొంటోంది. కానీ ఇవి చిన్న సమస్యలే” అని ISS లో జరిగిన అధికారిక స్వాగత కార్యక్రమంలో శుక్లా చెప్పారు.
1984లో రాకేశ్ శర్మ అంతరిక్షంలోకి వెళ్లారు. అక్కడ 8 రోజులు ఉన్నారు. ఆ తర్వాత 41 సంవత్సరాలలో అంతరిక్షంలోకి వెళ్ళిన రెండవ భారతీయుడు శుక్లానే.