Assam: అస్సాంలో ర్యాట్-హోల్ బొగ్గు గనిలో ప్రమాదం..

గనిలోకి నీరు చేరడంతో చిక్కుకుపోయిన 18 మంది..;

Update: 2025-01-07 00:15 GMT

అస్సాంలోని డిమా హసావో జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. 300 అడుగుల లోతున్న క్వారీలోకి నీరు రావడంతో కార్మికులు ‘‘ర్యాట్ హోల్’’ బొగ్గు గనిలో చిక్కుకుపోయారు. అక్రమ గని మేఘాలయ సరిహద్దుల్లో ఉన్న మారుమూల పారిశ్రామిక పట్టణమైన ఉమ్రాంగ్సోలో ఉంది. గనిలో దాదాపుగా 100 అడుగుల మేర నీరు చేరిందని, సహాయక చర్యలకు తీవ్రమైన అంతరాయం కలుగుతోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. స్థానిక పోలీసులు, రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని రెండు మోటార్ల సాయంతో నీటిని బయటకు తీస్తున్నారు.

ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బలగాలు సహాయ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు బయలుదేరాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ సర్మ కొనసాగుతున్న రెస్క్యూ కార్యక్రమాలను ముమ్మరం చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఆర్మీ నుంచి సాయం కోరింది. “కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్‌లో మేము ఆర్మీ సహాయాన్ని అభ్యర్థించాము. రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (SDRF) మరియు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF) కూడా ప్రయత్నాలలో సహాయం చేయడానికి సంఘటన స్థలానికి చేరుకుంటున్నాయి” అని చెప్పారు.

ర్యాల్ హోల్ మైనింగ్ అనేది ప్రమాదకరమైన పద్ధతి. కార్మికులు ఇరుకైన సొరంగాల్లో మాన్యువల్‌గా తవ్వుతుంటారు. ఈ సొరంగాలు లోతైన గుంటలకు దారి తీస్తాయి. వీటి నుంచి బొగ్గు తవ్వి తీస్తుంటారు. 2018లో, మేఘాలయలోని తూర్పు జైంతియా హిల్స్ జిల్లాలోని అక్రమ బొగ్గు గనిలో సమీపంలోని నది నుండి నీరు రావడంతో 15 మంది మైనర్లు అందులో చిక్కుకున్నారు. ఈ ప్రమాదంలో కేవలం 2 మృతదేహాలను మాత్రమే లభ్యమైనట్లు రెస్క్యూ సిబ్బంది చెప్పింది. 2019లో, మేఘాలయ రాష్ట్రంలో అక్రమ బొగ్గు తవ్వకాన్ని అరికట్టడంలో విఫలమైనందుకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) రూ. 100 కోట్ల జరిమానా విధించింది. రాష్ట్రంలోని 24,000 గనుల్లో చాలా వరకు అక్రమ గనులు ఉన్నాయని ఎన్జీటీ తేల్చింది.

Tags:    

Similar News