Cyber Crime: మొబైల్‌ ఫోన్‌ గిఫ్ట్‌గా పంపి రూ.2.8 కోట్లు కొట్టేశారు

బెంగళూరులో టెకీని మోసం చేసిన సైబర్‌ నేరస్థులు;

Update: 2025-01-20 06:15 GMT

లాటరీలో మీరు మొబైల్‌ ఫోన్‌ గెలుచుకున్నారు.. అని సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరుకు కొత్త ఫోన్‌ పంపిన సైబర్‌ నేరస్థులు అందులో సిమ్‌ వేయగానే అతని బ్యాంకు ఖాతాలోంచి రూ.2.8 కోట్లు కొట్టేశారు.  ఇదంతా చేసిందెవరు, టెకీ అంత పెద్ద మొత్తంలో డబ్బులు ఎలా పోగొట్టుకున్నాడో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

బెంగళూరుకు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఇటీవలే ఓ సిమ్‌కార్డు కొనుగోలు చేశాడు. అయితే తన ఫోన్‌లో ఆ సిమ్ వేసి వాడుతున్న కొన్ని రోజులకే అతడికి ఓ అపరిచిత వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. ఎవరో అనుకుని ఫోన్ తీసిన టెకీకి.. ఓ మంచి శుభవార్త చెప్పాడు ఆ వ్యక్తి. ముఖ్యంగా కొత్తగా సిమ్‌కార్డు కొనుగోలు చేసిన వారందరి పేరిట లాటరీలు తీశామని వెల్లడించాడు. అయితే అందులో మీరు గెలుపొందారని.. గెలుపొందిన వాళ్లకు ఓ రెడ్‌మీ ఫోన్‌ను గిఫ్టుగా ఇస్తున్నట్లు వివరించాడు. అంతేకాకుండా ఆ ఫోన్‌ను ఏ అడ్రస్‌కు పంపాలో కూడా తెలపమంటూ కోరాడు.

సిమ్‌కార్డు కొనుగోలు చేస్తే సెల్‌ఫోన్‌ బహుమతిగా రావడంతో తెగ సంబురపడిపోయాడా టెకీ. వెంటనే తన అడ్రస్‌ను సదరు వ్యక్తికి ఇచ్చి.. ఆ ఫోన్ తన వద్దకు ఎప్పుడు వస్తుందని కూడా అడిగాడు. మరో వారం రోజుల్లోనే ఆ ఫోన్ మీ వద్దకు వస్తుందని చెప్పగా.. రోజూ దాని గురించి ఎదురు చూస్తూ కూర్చున్నాడు. అయితే సడెన్‌గా ఓరోజు ఆ ఫోన్ తన ఇంటికి వచ్చేసింది. గబగబా డెలివరీ బాయ్ నుంచి ఆ పార్శిల్ తీసుకున్న టెకీ.. వెంటనే ఓపెన్ చేసి చూశాడు. అందులో నిజంగానే ఓ రెడ్‌మీ ఫోన్ ఉండడం చూసి మరింత మురిసిపోయాడు.

వెంటనే తన పాత ఫోన్‌లో ఉన్న సిమ్‌కార్డు తీసేసి.. కొత్త ఫోన్‌లో వేశాడు. ఆపై పలు యాప్స్‌ను ఇన్‌స్టాల్ చేసుకున్నాడు. అయితే గంట తర్వాత ఆ ఫోన్‌కు అనేక మెసేజ్ లు, ఓటీపీలు వచ్చాయి. అయితే కొత్త ఫోన్‌లో యాప్స్ ఇన్‌స్టాల్ చేస్తున్నప్పుడు ఇదంతా జరగడం సహజమే అనుకున్న అతడు వాటిని చదవకుండానే వదిలేశాడు. కానీ వారం రోజుల్లోనే తన ఖాతాలో ఉన్న రూ.2.80 కోట్లు మాయమవడంతో షాకై వెంటనే బ్యాంకుకు వెళ్లాడు. ఆరా తీయగా.. మీరే ఎవరికో ఆ డబ్బులను ట్రాన్స్‌ఫర్ చేశారంటూ బ్యాంకులోని ఉద్యోగులు చెప్పారు. అప్పుడు తాను మోసపోయినట్లు గుర్తించిన టెకీ.. వెట్ఫీల్డ్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా.. సైబర్ నేరగాళ్లే అతడికి ఓ ఫోన్ పంపించారని గుర్తించారు. ఆ ఫోన్‌లో ముందుగా ఇన్‌స్టాల్ చేసిన కొన్ని యాప్స్‌తోనే టెకీకి సంబంధించిన ఓటీపీలు, పాస్‌వర్డులను గుర్తించి అతడి ఖాతాలో ఉన్న 2 కోట్ల 80 లక్షల రూపాయలను కొట్టేసినట్లు తెలుసుకున్నారు. ప్రస్తుతం నిందితుడిని పట్టుకునేందుకు పెద్ద ఎత్తున కృషి చేస్తున్నారు. అంతేకాకుండా ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చిన ఎలాంటి బహుమతులను ఉపయోగించకూడదని.. వారి చెప్పినట్లు చేసి పెద్ద మొత్తంలో డబ్బులు మోసపోవద్దని హెచ్చరిస్తున్నారు.

Tags:    

Similar News