Encounter : జమ్ము కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌..

ఇద్దరు ఉగ్రవాదులు హతం;

Update: 2025-07-30 04:45 GMT

 జమ్ము కశ్మీర్‌ లో ఎన్‌కౌంటర్‌  చోటు చేసుకుంది. పూంచ్‌ ప్రాంతంలో బుధవారం ఉదయం చోటు చేసుకున్న ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు  హతమయ్యారు. పహల్గాం దాడిలో పాల్గొన్న ముగ్గురు ముష్కరులను ఆపరేషన్‌ మహాదేవ్‌ ద్వారా హత మార్చిన రోజుల వ్యవధిలోనే ఈ ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకోవడం గమనార్హం.

పూంచ్‌ సెక్టార్‌లోని జెన్‌ ప్రాంతంలో కంచె వెంబడి బుధవారం ఉదయం ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో భద్రతా దళాలు వెంటనే కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో ఇద్దరు ముష్కరులు హతమయ్యారు. వారు లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాదులుగా భావిస్తున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఆపరేషన్‌ కొనసాగుతున్నట్లు ఆర్మీకి చెందిన వైట్‌ నైట్‌ కార్ప్స్‌ ఎక్స్‌ వేదికగా వెల్లడించింది.

కాగా, సోమవారం ఉదయం దాచిగామ్‌ నేషనల్‌ పార్క్‌ సమీపంలో ఎన్‌కౌంటర్‌ చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఎన్‌కౌంటర్‌లో పహల్గాం దాడిలో పాల్గొన్న ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. ఉదయం 11.30 గంటల సమయంలో దాచిగామ్‌ నేషనల్‌ పార్క్‌ పరిసరాల్లో ముగ్గురు ఉగ్రవాదులను గుర్తించిన భద్రతాదళాలు.. మెరుపు వేగంతో కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో ఉగ్రవాది సులేమాన్‌ షాతో పాటు పహల్గాం దాడికి కారణమైన మరో ఉగ్రవాది యాసిర్‌ హతమైనట్టు అధికారులు తెలిపారు. ఈ కాల్పుల్లో మరో ఉగ్రవాది అబూ హామ్‌జా కూడా హతమైనట్టు పేర్కొన్నారు. వీరందరూ విదేశీ ఉగ్రవాదులేనని తెలిపారు. ఈ ఆపరేషన్‌లో ఆర్మీ, సీఆర్పీఎఫ్‌, జమ్ముకశ్మీర్‌ పోలీసులు పాలుపంచుకొన్నట్టు పేర్కొన్నారు. ఎన్‌కౌంటర్‌ అనంతరం జరిపిన సోదాల్లో 17 గ్రెనెడ్లు, ఒక ఎం4 కార్బైన్‌, రెండు ఏకే 47 రైఫిల్స్‌ను భద్రతాదళాలు స్వాధీనం చేసుకొన్నాయి.

Tags:    

Similar News