వెదురు కర్రలతో తయారు చేసిన తెప్పపై నది దాటేందుకు కొందరు వ్యక్తులు ప్రయత్నించారు. అయితే సుమారు 20 మంది ఉన్న ఆ తెప్ప అదుపుతప్పింది. అది ఒక పక్కకు ఒరిగిపోయింది. దీంతో ఆ తెప్పపై ఉన్న వారు నదిలో పడ్డారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బీహార్‌లోని పూర్నియా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మరణించిన ఒక వ్యక్తి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు కొందరు ప్రయత్నించారు. నదిపై వంతెన లేకపోవడంతో వెదురు కర్రలతో తాత్కాలికంగా ఒక తెప్పను తయారు చేశారు. పిల్లలు, పెద్దలతో సహా సుమారు 20 మంది ఆ తెప్పపై నది దాటేందుకు ప్రయత్నించారు.
కాగా, వెదురు కర్రలతో తాత్కాలికంగా తయారు చేసిన ఆ తెప్పను తాడు సహాయంతో అవతలి ఒడ్డువైపు లాగేందుకు దానిపై ఉన్న ఇద్దరు వ్యక్తులు ప్రయత్నించారు. అయితే ఆ తెప్పపై ఎక్కువ మంది ఉండటంతో అధిక బరువు వల్ల అది బ్యాలెన్స్ తప్పింది. దీంతో ఒక పక్కకు ఆ తెప్ప ఒరిగింది. ఈ నేపథ్యంలో దానిపై ఉన్నవారిలో చాలా మంది ఆ నడిలో పడ్డారు.
మరోవైపు నదిలో పడిన వారంతా ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. దీంతో ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదని అధికారులు తెలిపారు. కాగా, తెప్పపై ఉన్న వారు నదిలో పడిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.