Constitution murder day: రాజ్యాంగ హత్యాదినంగా జూన్ 25
ఎమర్జెన్సీకి గుర్తుగా..
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రధానిగా ఇందిరా గాంధీ 1975, జూన్ 25న విధించిన ‘ఎమర్జెన్సీ’ రోజును ఇకపై ‘రాజ్యాంగ హత్యా దినం’గా పాటించనున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ శుక్రవారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎమర్జెన్సీ రోజుల్లో అనేక ఇబ్బందులకు గురైన లక్షలాది మందిని స్మరించుకొనేందుకు, అణచివేత ప్రభుత్వంలో పెద్దయెత్తున హింసను ఎదుర్కొంటూ దేశ ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించేందుకు పోరాడిన వారి స్ఫూర్తిని గౌరవించేందుకు ఈ నిర్ణయం తీసుకొన్నట్టు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తెలిపారు.
‘సంవిధాన్ హత్యా దివస్’ను పాటించడం వలన వ్యక్తి స్వేచ్ఛ, ప్రజాస్వామ్య పరిరక్షణ జ్వాల దేశంలోని ప్రతి ఒక్క పౌరుడిలో సజీవంగా ఉంటుందని పేర్కొన్నారు. 1975, జూన్ 25న ఎమర్జెన్సీ విధింపుతో ఎలాంటి తప్పు లేకుండా లక్షలాది మందిని జైళ్లలో వేశారని ఆరోపించారు.
ఎమర్జెన్సీ సమయం..
దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు 1975 జూన్ 25వ తేదీ అర్ధరాత్రి నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఆకాశవాణి ద్వారా ప్రకటించారు. రాయ్‌బరేలీ నుంచి లోక్‌సభకు ఆమె ఎన్నిక చెల్లదని అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై షరతులతో కూడిన స్టే ఉత్తర్వును సుప్రీంకోర్టు వెలువరించిన కాసేపటికే ఇందిర ఈ సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఆమె పార్లమెంటరీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సుప్రీంకోర్టు ఆదేశించిన క్రమంలోనే ఇందిర ఎమర్జెన్సీ ప్రకటన చేశారు. దేశంలో రాజకీయ నిర్బంధాలు మొదలయ్యాయి. ఇందిరను తొలగించేందుకు జయప్రకాశ్ నారాయణ్ (జేపీ) దేశవ్యాప్త ఉద్యమానికి పిలుపునిచ్చారు. విపక్ష నేతలైన జేపీ, ఆడ్వాణీ, వాజ్‌పేయి, మొరార్జీ దేశాయ్ సహా అనేకమందిని ఖైదు చేశారు. పత్రికాస్వేచ్ఛపై ఆంక్షలకు తోడు పలురకాల నిర్బంధాలకు దారితీసిన ఎమర్జెన్సీని ముగిస్తూ.. ఎన్నికలు నిర్వహించబోతున్నట్లు 1977 జనవరి 18న ఇందిర ప్రకటించారు. ఆ ఏడాది మార్చి 16 నుంచి 20 వరకు ఎన్నికలు నిర్వహించి, 21న అత్యయిక పరిస్థితిని ఎత్తివేశారు.
కాంగ్రెస్ విమర్శలు..
కేంద్ర ప్రభుత్వం జూన్ 25వ తేదీని ‘ప్రజాస్వామ్య హత్యా దివస్’గా ప్రకటించడంపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. గత పదేండ్లుగా దేశంలో ప్రధాని మోదీ అప్రకటిత ఎమర్జెన్సీని నడుపుతున్నారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ విమర్శించారు. ఇటీవల 2024, జూన్ 4న విడుదలైన లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో దేశ ప్రజలు మోదీకి వ్యక్తిగత, నైతిక ఓటమి ఇచ్చారని, జూన్ 4వ తేదీ చరిత్రలో ‘మోదీ ముక్తి దివస్’గా నిలుస్తుందని ఎక్స్ పోస్టులో అన్నారు.