Karnataka: హార్ట్‌ఎటాక్‌తో యూపీఎస్సీ అభ్యర్థిని మృతి

కర్ణాటకను హడలెత్తిస్తోన్న ఆకస్మిక మరణాలు..;

Update: 2025-07-10 06:30 GMT

కర్ణాటక రాష్ట్రాన్ని ఆకస్మిక మరణాలు హడలెత్తిస్తున్నాయి. ఎక్కువగా యువకులే గుండెపోటుతో మరణిస్తున్నారు. గత జూన్ నెలలో హసన్ జిల్లాలో 23 మంది హార్ట్‌ఎటాక్‌తో ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఆకస్మిక మరణాలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. దీంతో గుండె పరీక్షల కోసం ప్రజలు ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. ఇలా రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇలాంటి సంఘటనలే కనబడుతున్నాయి.

ఇదిలా ఉంటే గత 24 గంటల్లో రాష్ట్రంలో ఏడుగురు గుండెపోటుతో మరణించారు. కళ్ల ముందు తిరుగుతూ ఉన్న వారే హఠాత్తుగా ప్రాణాలు వదులుతున్నారు. ఇక బుధవారం ధార్వాడలోని పురోహిత్ నగర్‌కు చెందిన జీవిత కుసగుర్(26) గుండెపోటుతో మరణించింది. ఆమె తండ్రి ఒక ఉపాధ్యాయుడు. కుమార్తెను ఐఏఎస్ చేయాలన్న ఉద్దేశంతో చదివిస్తున్నాడు. ఇంతలోనే గుండెపోటు రూపంలో మృత్యువు కబళించడంతో కుటుంబ సభ్యులు తల్లిడిల్లిపోతున్నారు. ఇంట్లో ఉన్నప్పుడు ఛాతీనొప్పి వస్తుందని చెప్పింది. వెంటనే కుటుంబ సభ్యులు నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే ఆమె తుది శ్వాస విడిచింది. ఆమెను పరీక్షించిన వైద్యులు చనిపోయినట్లుగా ధృవీకరించారు. ఈ వార్త స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. చిన్న వయసులోనే గుండెపోటులు రావడంతో రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపుతోంది.

జీవిత కుసగుర్ ప్రస్తుతం ఎంఎస్సీ (అగ్రి) పూర్తి చేసింది. యూపీఎస్సీ పరీక్షకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. సివిల్స్‌ పరీక్షల్లో పాస్‌ అయి.. ఐఏఎస్‌ లేదా ఐపీఎస్‌ కావాలనేది ఆమె కల. కానీ ఇంతలోనే గుండెపోటు రూపంలో మృత్యువు కబళించింది.

గత నెలలో 40 రోజుల వ్యవధిలో హసన్‌ జిల్లాలో 23 గుండె సంబంధిత మరణాలు నమోదయ్యాయి. దీంతోనే మైసూర్, బెంగళూర్ జయదేవా ఆస్పత్రికి రోగుల సంఖ్య పెరిగింది. ఈ మరణాలను రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఈ మరణాలను పరిశోధించేందుకు జయదేవా ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్డియోవాస్కులర్ సైన్సెస్ డైరెక్టర్ డాక్టర్ కెఎస్ రవీంద్రనాథ్ నేతృత్వంలోని కమిటీని రాష్ట్రం ఆదేశించింది. ఇక జీవనశైలిలో మార్పులు, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, మంచి ఆహార అలవాట్లతో గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.

Tags:    

Similar News