Train Derails: జర్మనీలో పట్టాలు తప్పిన రైలు.. ముగ్గురు మృతి,
34 మందికి గాయాలు;
జర్మనీలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. 100 మందితో వెళ్తున్న రైలు పట్టాలు తప్పడంతో ముగ్గురు మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. జర్మనీలోని సిగ్మరింగెన్ పట్టణం నుండి ఉల్మ్ నగరానికి వెళుతున్న ప్యాసింజర్ రైలు అటవీ ప్రాంతంలో పట్టాలు తప్పింది.
ఆదివారం(అక్కడి కాలమానం ప్రకారం) నైరుతి జర్మనీలోని బాడెన్-వుర్టెంబర్గ్ పరిధిలోని రీడ్లింగెన్ పట్టణానికి సమీపంలో సాయంత్రం 6:10 గంటలకు ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు ప్రయాణికులు మృతిచెందారని పోలీసులు తెలిపారు. 50 మంది గాయపడ్డారని భావిస్తున్నారు. అయితే వీరి సంఖ్య ఎంతనేది చెప్పేందుకు అధికారులు నిరాకరించారు. రెండు రైలు బోగీలు పట్టాలు తప్పాయని, దీనికిగల కారణం తెలియరాలేదని అధికారులు పేర్కొన్నారు.
రైల్వే అధికారులు ప్రస్తుతం ప్రమాద తీరుతెన్నులను పరిశీలిస్తున్నారని ఆపరేటర్ తెలిపారు. ఈ మార్గంలో 40 కిలోమీటర్ల (25-మైళ్ల) పొడవునా రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. మరోవైపు స్థానిక వాతావరణశాఖ ఈ ప్రాంతంలో తీవ్రమైన తుఫాను గాలులు వీస్తున్నందున కొండచరియలు విరిగిపడే అవకాశం ఉన్నదని హెచ్చరించింది. జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ మృతుల కుటుంబాలకు సంతాపాన్ని తెలిపారు. రవాణా మంత్రులతో మాట్లాడుతున్నానని, అత్యవసర సేవలను అందించాలని కోరానని ఆయన తెలిపారు.
స్థానిక టీవీ స్టేషన్ ఎస్‌డబ్ల్యూ ఆర్ తెలిపిన వివరాల ప్రకారం గాయపడిన వారిని ఆ ప్రాంతంలోని వివిధ ఆస్పత్రులకు తరలించేందుకు హెలికాప్టర్లు సేవలు అందించాయి. కాగా 2022 జూన్‌లో దక్షిణ జర్మనీలోని బవేరియన్ ఆల్పైన్ రిసార్ట్ సమీపంలో ఒక రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. 1998లో లోయర్ సాక్సోనీలోని ఎస్చెడ్‌లో హై-స్పీడ్ రైలు పట్టాలు తప్పగా, 101 మంది మృతిచెందారు.